- ఉచితం సముచితమేనా ?
- “మహాలక్ష్మి” పథకంతో మా బతుకులు దరిద్రంగా మారాయి….
- ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి….
- భారీ ర్యాలీ నిర్వహించిన ఆటో యూనియన్ సంఘం…
మన్యం న్యూస్,పినపాక:
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మా బ్రతుకుల పాలిట శాపంలా మారిందని పినపాక మండల వ్యాప్తంగా ఆటో యూనియన్ నాయకులు ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా మహిళా మణులు పూర్తిగా ఆటో ఎక్కడ మానేశారని, ఉదయం నుండి సాయంత్రం వరకు ఆటో నడపడం వల్ల ఇంటిని గడపడానికి కూడా సరిపోని ఆదాయం లభిస్తుందని, ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాము సాయంత్రం వరకు ఆటో నడపడం వల్ల ఐదు వందలకు పైగా ఆదాయము పొందే వారమని, ప్రస్తుతం ఆదాయం లేక కుటుంబాన్ని నడపడం భారంగా మారిందని, దీనికి తోడు రాబోయే కాలంలో ఆటోకు సంబంధించిన ఈఎంఐ చెల్లించడం కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత పథకం అన్ని వర్గాలకు సమచితంగా ఉంటుందనే ఆలోచన ప్రభుత్వం చేయలేదని, ఇప్పటికైనా ఆలోచించి తమ జీవితాలకు పరిష్కారం చూపాలని ఆటో డ్రైవర్లు తెలియజేస్తున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం ఆలోచించి ఉపాధి పొందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సంఘం నాయకులు పాల్గొన్నారు.