ఇజ్రాయెల్-హమాస్ యుద్దంతో ప్రపంచ దేశాలన్నీ టెన్షన్లో ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 21000 మంది గాజా వాసులు చనిపోయారని సమాచారం. ఐక్యరాజ్యసమితిలో దాదాపు ప్రతీ రోజు దీనిపై చర్చ జరుగుతోంది.
ప్రపంచ దేశాలలో అత్యధికం ఈ యుద్ధాన్ని ఆపాలని కోరుతుంటే ఇజ్రాయెల్ మాత్రం అక్టోబర్ 7న హమాస్ దాడులను కారణంగా చూపుతూ దాదాపు 90 శాతం గాజాను ఆక్రమించుకుంటూ పోతోంది. అమాయక పౌరులను నిర్దాక్షిణ్యంగా బాంబు దాడులతో హత్య చేస్తోంది. అయితే ఈ యుద్దంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా నిలబడడంతో పెద్ద సమస్యగా మారింది. పాశ్చాత్య దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తొలుత ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలబడినా.. భారీ స్థాయిలో పాలస్తీనా వాసుల రక్తపాతం చూసి వెనుకడుగు వేశాయి.
దీనిపై తాజాగా బుధవారం ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గెటెరస్ స్పందించారు. కారణం లేకుండా ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేయలేదని.. గత 56 ఏళ్లుగా అంతర్జాతీయ చట్టాలను నిర్లక్ష్యం చేస్తూ.. పేద పాలస్తీనా వాసుల భూములను ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడమే ఈ యుద్ధానికి అసలు కారణమని ఆయన తీవ్ర స్వరంతో చెప్పారు.
”56 ఏళ్లుగా పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ దారుణాలు చేస్తోంది. పాలస్తీనా వాసులకు స్కూళ్లు, ఆస్పత్రులు లేవు. వారికి ఆర్థిక వ్యవస్థ లేదు. పాలస్తీనా యువతకు ఉద్యోగాలు లేవు. వారి ఇళ్ల నుంచి వారిని ఇజ్రాయెల్ బలవంతంగా ఖాళీ చేయిస్తోంది. ఇజ్రాయెల్ సైనికులు వారితో హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వారి భూములను ఆక్రమించుకొని ఇజ్రాయెల్ వాసులు నివాసాలు ఏర్పర్చుకుంటున్నారు. ఎన్నిసార్లు ఐక్యరాజ్యసమితి ఈ అంశంపై హెచ్చరించినా.. ఇజ్రాయెల్ ధోరణి మారలేదు. ఇప్పుడు యుద్ధంతో అమాయక పౌరులకోసం ఐక్యరాజ్యసమితి అందించే మానవత్వ సహాయం కూడా అందకుండా చేస్తోంది,” అని ఆంటోనియో అన్నారు.
ఆంటోనియో చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఏకంగా ఐక్యరాజ్యసమితి అధికారులకే వీసా ఇవ్వడానికి నిరాకరించింది. ” గాజాలోని ఎవరినీ అనుమతించేది లేదు. ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఎవరు నిలబడినా.. ఉపేక్షించేది లేదు.. అది ఎవరైనా(ఐక్యరాజ్యసమితి) సరే,” అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యఆవ్ గాలెంట్ అన్నారు.