UPDATES  

 రికార్డుల నిర్మల…

ప్రపంచంలో అత్యంత ప్రభావశీల మహిళల్లో నిర్మలా సీతారామన్ ఒకరు. ఫోర్స్బ్ 100 మోస్ట్ పవర్ ఫుల్ విమెన్ జాబితాలో ఆమె 32వ స్థానం దక్కించుకున్నారు. మోదీ సర్కారు రెండో సారి పగ్గాలు చేపట్టిన తర్వాత కేంద్ర మంత్రి వర్గంలో కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్మలకు అప్పగించారు. మే, 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమె.. కరోనా మహమ్మారి చుట్టుముట్టిన తరుణంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూడటంలో కీలక పాత్ర వహించారు.

 

ఇందిర తర్వాత రెండో మహిళ

 

ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక శాఖను చేపట్టిన రెండో మహిళగా రికార్డులకి ఎక్కారు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ నుంచి నిర్మల మాస్టర్స్‌ పూర్తిచేశారు. కెరీర్‌ తొలినాళ్లలో లండన్‌లోని ఓ స్టోర్‌లో పనిచేశారు. తర్వాత యూకేలో అగ్రికల్చరల్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌లో ఆర్థిక సలహాదారు బాధ్యతలు నిర్వర్తించారు. మోదీ తొలి ప్రభుత్వంలో ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా, తర్వాత రక్షణ మంత్రిగా వ్యవహరించారు.

 

ఇప్పుడు మధ్యంతర బడ్జెట్టే

 

2017లో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. ఆర్థిక మంత్రిగా నిర్మల 5 పూర్తి స్థాయి బడ్జెట్లు ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్నది ఆరోది. అయితే అది మధ్యంతర బడ్జెట్టే. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కానుంది. కొత్త ప్రభుత్వం కొలువు దీరే వరకు చేయాల్సిన జమాఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తెలుపుతుంది. ఈ బడ్జెట్టే ఈసారికి ఆఖరిది.

 

అత్యధిక బడ్జెట్ల సమర్పణ

 

ఆర్థిక మంత్రిగా నిర్మల పలు రికార్డులను సొంతం చేసుకున్నారు. ఇందిర తర్వాత ఆ పదవిని చేపట్టిన రెండో మహిళ అయినా.. ఫుల్‌టైమ్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన మహిళగా ఘనత సాధించారు. ఇక.. అత్యధిక బడ్జెట్లు సమర్పించిన మహిళా ఆర్థికమంత్రి కూడా నిర్మలే. ఇందిర ఒక్కసారే బడ్జెట్ సమర్పించారు. 1970లో ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ రాజీనామా చేయడంతో ఆ శాఖ బాధ్యతలను కూడా ప్రధానిహోదాలో ఇందిరే చూశారు. అలా తొలి ఆర్థిక మంత్రిగా ఆమె 1970-71 బడ్జెట్‌ను సమర్పించారు.

 

సుదీర్ఘ ప్రసంగం

 

తొలి బడ్జెట్ సమయంలోనే నిర్మల రికార్డు సృష్టించారు. సుదీర్ఘంగా బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా చరిత్ర పుటలకెక్కారు. సాధారణంగా బడ్జెట్ ప్రసంగానికి 90 నుంచి 120 నిమిషాల సమయం పడుతుంది. కానీ 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఆమె అంతకు మించి ఎక్కువ సమయమే తీసుకున్నారు. ఏకంగా 2 గంటల 17 నిమిషాలు మాట్లాడారు. అప్పటి వరకు జశ్వంత్ సింగ్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు. 2003లో ఆయన 2 గంటల 15 నిమిషాలు ప్రసంగించారు.

 

తన రికార్డును తానే అధిగమించి.

 

బడ్జెట్ ప్రసంగం విషయంలో నిర్మల తన రికార్డును తానే అధిగమించడం విశేషం. రెండో బడ్జెట్(2020-21) సమర్పణ సమయంలో ఆమె ఏకధాటిగా 2 గంటల 42 నిమిషాలు ప్రసంగించారు. అప్పటికీ ఆ ప్రసంగం మరో 2 పేజీలు మిగలటం, ఆ రోజు ఆమె అలసటకు గురికావటంతో అంతటితో ప్రసంగాన్ని ముగించారు. 2022లోనూ కూడా నిర్మల దాదాపు గంటన్నర పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. 2023లో అతి తక్కువ సమయం అంటే 87 నిమిషాలు బడ్జెట్ ప్రసంగం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !