మన్యం న్యూస్ చర్ల;
చర్ల మండలం చీమలపాడు గ్రామానికి చెందిన జల్లరపు సర్వేశ్వరరావు వ్యవసాయ కూలి కుటుంబానికి చెందిన నిరుపేద వ్యక్తి. చిన్నతనం నుంచి కుటుంబానికి అండగా ఉంటూ తన చదువుకు అవసరమయ్యే ఆర్థిక వనరులను పని చేసుకొని సమకూర్చుకుంటూ చదువుకున్నాడు. పగలు పనిచేసుకుంటూ రాత్రి చదువుతూ పీజీ పూర్తి చేసినాడు. తాను చదివిన చదువు కష్టానికి ఫలితంగా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం పొందాడు. దుమ్ముగూడెం మండలం కొత్తూరు గ్రామపంచాయతీకి పంచాయతీ కార్యదర్శిగా నియమితుడైన సర్వేశ్వరరావు తను చేసే పనిని నియమ నిబంధనలతో చేస్తూ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తూ వస్తున్నాడు. జిల్లాలోని ఉత్తమమైన పంచాయతీగా కొత్తూరు గ్రామపంచాయతీని తీర్చిదిద్దటంలో తన పాత్ర ఎంతగానో ఉంది. ఎంతో అంకితభావంతో తను చేస్తున్న ఉద్యోగానికి ప్రభుత్వం మెచ్చి 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా నుంచి ఉత్తమ పంచాయతీ కార్యదర్శి గా అవార్డ్ స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా సర్వేశ్వరరావు మాట్లాడుతూ చిన్నతనం నుంచి కష్టపడి చదివిన ఫలితంగానే ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకున్నానని, ప్రతి ఒక్కరూ మంచిగా చదువుతే ఉత్తమమైన స్థాయికి ఆ చదివే తీసుకెళ్తుందని, చదువు అనేది మన కుటుంబానికి సమాజానికి ఎంతో వెలుగునిస్తుందని ఆయన అన్నారు.