మన్యం న్యూస్ గుండాల: ఎర్రన్న ఆశయ సాధన కోసం పనిచేద్దామని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా నాయకురాలు చంద్ర అరుణ అన్నారు.గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ మండల కార్యదర్శి కొమరం శాంతయ్య అధ్యక్షతన మఠంలంక గ్రామంలో అమరుడు కామ్రేడ్ కుంజా ఎర్రన్న సంతాప సభను శనివారం నిర్వహించారు.సభా ప్రారంభంలో కామ్రేడ్ ఎర్రన్న ఆశయాలను కొనసాగిస్తామని రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ జోహార్లు అర్పించారు మాట్లాడుతూ కామ్రేడ్ కుంజా ఎర్రన్న చిన్ననాటి నుండే విప్లవ పార్టీ సిపిఐ(ఎంఎల్) ప్రజాపంథాతో అనుబంధం కలిగిన వ్యక్తియని, చనిపోయే నాటికి ప్రజాపంథా గ్రామ కమిటీ సభ్యులుగా కొనసాగారని గుర్తు చేసుకున్నారు.చీకటి రోజుల్లో ఎమర్జెన్సీ కాలంలో కూడా నిర్బంధాన్ని లెక్కచేయకుండా విప్లవ పార్టీ పక్షాన నిలబడ్డాడని కొనియాడారు.విప్లవోద్యమంలో ఎంతోమంది రహస్య నాయకులతో తన సహచర్యం కలిగిన గొప్ప నాయకుడని అన్నారు.కామ్రేడ్ ఎర్రన్న నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే వారికి అండగా నిలబడి ప్రోత్సహించే వ్యక్తి అని, కామ్రేడ్ ఎర్రన్న తుది శ్వాస విడిచే వరకు ఆదర్శవంతమైన జీవితం గడిపారని, ఆయన మరణం విప్లవోద్యమానికి సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా)కు తీరనిలోటని అన్నారు.కామ్రేడ్ ఎర్రన్నకు సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్(ప్రజాపంథా) వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పిస్తూ, బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తుందన్నారు. భారత విప్లవోద్యమ బలోపేతానికి మూడు కమ్యూనిస్టు పార్టీలు ఐక్యమవుతున్న సందర్భంగా ఖమ్మం నగరంలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ సంతాప సభలో గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల సర్పంచ్ కోరం సీతారాములు, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు పూనెం శీనులు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్(ప్రజాపంథా) ఇల్లందు డివిజన్ కార్యదర్శి ఈసం శంకర్, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు అజ్మీర బిచ్చా, పి వై ఎల్ రాష్ట్ర కార్యదర్శి వాంకుడోత్ అజయ్, పార్టీ నేతలు గొగ్గెల వెంకటేశ్వర్లు, ఏడుల రామనాథం, ఈసం చంద్రయ్య, మోకాల ఆజాద్, పూనెం లక్ష్మయ్య, పూనెం మంగయ్య, తెల్లం రాజు, ఈసం కృష్ణ, సనప కుమారు, కోడూరి జగన్, దుగ్గి రాంబాబు, ఈసం సింగన్న, కల్తీ రామన్న, సనప కిశెందర్, తదితరులు పాల్గొన్నారు.
