UPDATES  

 నేడు BRS చలో నల్లగొండ.. రైతుగర్జన పేరుతో భారీ బహిరంగ సభ..

నేడు చలో నల్లగొండకు పిలుపునిచ్చింది బీఆర్‌ఎస్‌. నల్లగొండ జిల్లాకేంద్రంలోని మర్రిగూడ బైపాస్‌రోడ్డులోని 50 ఎకరాల స్థలంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రైతుగర్జన పేర భారీ బహిరంగసభ నిర్వహించనుంది బీఆర్‌ఎస్‌. ఈ సభ ద్వారా.. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయంలో.. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని.. ఎండగట్టాలని భావిస్తున్నారు కేసీఆర్‌. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ తొలిసారి జనంలోకి అడుగుపెడుతున్నారు. దీంతో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేసింది గులాబీ పార్టీ.

 

కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ నల్లగొండ సభలో తన ప్రసంగ శైలిని మార్చే అవకాశముంది. 6 నెలల్లోగా నదీ జలాల పంపకం పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నల్లగొండ సభావేదికగా కేసీఆర్‌ అల్టిమేటం జారీ చేసే అవకాశాలున్నాయి.

 

గతేడాది డిసెంబర్ లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి.. ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఓటమిని చవిచూసిన కొద్దిరోజుల్లోనే పార్టీ అధినేత కేసీఆర్ తుంటి ఎముక శస్త్రచికిత్స జరిగి.. విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం కాస్త ఆరోగ్యం కుదుటపడ్డాక.. పార్టీ నేతలతో నందినగర్‌ నివాసంలో, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశాలు నిర్వహించారు. అయితే.. కేసీఆర్‌ మాత్రం ఇప్పటి వరకు బహిరంగంగా జనంలోకి రాలేదు. ఈ నెల 1న గజ్వేల్‌ ఎమ్మెల్యేగా స్పీకర్‌ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌ అదేరోజు తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతోనూ భేటీ అయ్యారు.

 

ప్రస్తుతం శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నా.. కేసీఆర్‌ మాత్రం వాటికి దూరంగా ఉన్నారు. కానీ పార్టీ ఓటమి తరువాత తొలిసారి జనంలోకి వస్తున్న కేసీఆర్‌.. నల్లగొండ సభలో ఆయన చేసే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభ ద్వారా లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని పరోక్షంగా ప్రారంభించినట్లేనని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

 

BRS ముఖ్య నేతలు తెలంగాణభవన్‌ నుంచి బయలుదేరనున్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ముఖ్య నేతలు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, తలసాని, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డితోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నల్లగొండ సభకు హాజరుకానున్నారు. కేటీఆర్‌ నేతృత్వంలో నేతలందరూ ప్రత్యేక బస్సుల్లో నల్లగొండకు వెళ్తారు. అధినేత కేసీఆర్‌ హెలికాప్టర్‌ ద్వారా నల్లగొండకు చేరుకొని.. సభ అనంతరం తిరిగి హెలికాప్టర్‌లోనే హైదరాబాద్‌కు చేరుకుంటారు.

 

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !