- రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- డిప్యూటీ సీఎం కొట్టుసత్యనారాయణ
- వైయస్సార్ జలకళ మోటార్లు పంపిణీ
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 14:
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు ప్రవేశ పెట్టారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి వైయస్సార్ జలకళ లబ్ధిదారులకు మోటార్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీలు తోచిన విధంగా మాట్లాడుతున్నాయి అన్నారు. అయితే రైతుకు ఏ ప్రభుత్వంలో, ఎవరి హయాంలో మేలు జరిగిందో ఆలోచించుకోవాలన్నారు. చంద్రబాబు హయాంలో వర్షాలు కురవక, పంటలు పండక రైతులు కరువుతో అల్లాడిపోయిన రోజులు గుర్తు చేసుకోవాలి అన్నారు. 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అప్పటివరకు మెట్ట రైతులకు ఉన్న కరెంట్ బిల్లులు బకాయిలు మాఫీ చేయడంతో పాటు ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టారన్నారు. ఆనాడు వైయస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తానంటే చంద్రబాబు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని ఎగతాళి చేశాడని, కానీ నేడు అదే ఉచిత విద్యుత్తు 20 ఏళ్లుగా ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయిన నిరాటంకంగా అమలు జరుగుతుందన్నారు. ఉచిత విద్యుత్తు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం రైతు బాగుండాలని, వ్యవసాయం బాగుండాలని పరితపిస్తారు అన్నారు. సీఎం జగన్ రైతులకు చేసిన మేలు మాటల్లో చెప్పడం కాదు అని చేతల్లో చేసి చూపించారన్నారు. ఎన్నికల హామీలు ఇవ్వకపోయినా వైయస్సార్ జలకళ పథకాన్ని ప్రవేశపెట్టి మెట్ట ప్రాంతంలోని చిన్న, సన్నకారు రైతులకు సీఎం జగన్ ఎంతో మేలు చేశారన్నారు. చిన్న చిన్న రైతులు బోర్లు వేయించుకునే స్తోమత లేక పెద్ద రైతుల మీద ఆధారపడటం, కొంతమంది అయితే పంటను పండించుకోలేకపోవడం వంటివి జరిగేవి అన్నారు. అటువంటి పరిస్థితుల నుంచి చిన్న, సన్నకారు రైతులకు మేలు చేకూరుస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ జలకళ పథకాన్ని తీసుకువచ్చారని మంత్రి కొట్టు తెలియజేశారు. రైతులకు మేలు చేస్తున్న ప్రభుత్వం ఏది అనేది రైతాంగం అంతా అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రకృతి వైపరీత్యాలకు పంటలు నష్టపోతే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, పంటల భీమా పరిహారం ఇచ్చి రైతులను ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు పురుగుమందులు వంటివి సరఫరా చేయడమే కాకుండా, రైతులు పండించిన పంటను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. గోని సంచులు, రవాణా, హమాలి చార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లించేలా సీఎం జగన్ ఏర్పాటు చేశారన్నారు. ఇలా రైతులను అన్ని విధాల ఆదుకుంటూ వైకాపా ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షాన పని చేస్తున్నారన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం పార్టీకి దాంతో పాటు కలిసి వస్తున్న ఇతర పార్టీలకు పరాభవం తప్పదని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతులకు వైయస్సార్ జలకళ మోటార్లు పంపిణీ చేశారు. 7.5 హెచ్ పి సామర్థ్యం గల మోటారు ఒక లక్ష రూపాయలు, 10 హెచ్ పి సామర్థ్యం గల మోటారు 1,25,000 రూపాయలు, 5 హెచ్ పి సామర్థ్యం గల మోటారు 69 వేల రూపాయలు విలువైనవి రైతులకు వైయస్సార్ జలకళ పథకంలో ఉచితంగా అందజేశారు. మెట్ట ప్రాంతంలోని చిన్న, సన్నకారు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొంది తమ భూములు సాగు చేసుకునేందుకు బోరు బావులను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ప్రభుత్వం ఉచితంగా తమకు అన్ని సమకూర్చడం పట్ల లబ్ధిదారులైన రైతులు హర్షం వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం మండలంలో మొత్తం 66 మంది రైతులకు వైయస్సార్ జలకళ పథకంలో వ్యవసాయ బోరు బావులు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, జడ్పిటిసి ముత్యాల ఆంజనేయులు, వైస్ ఎంపీపీ కట్టా రంగబాబు, వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు, నవాబుపాలెం సొసైటీ చైర్మన్ జడ్డు హరిబాబు, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యూల్, ఎఎంసి వైస్ చైర్మన్ చోడగిరి చినబాబు, తాడేపల్లిగూడెం ఎంపీడీవో ఎస్. సుబ్రహ్మణ్య శర్మ, పుల్లయ గూడెం చీకట్ల మల్లేశ్వరరావు, ఎన్ఆర్ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ థామస్, ఇంకా పలువురు గ్రామ సర్పంచ్ లు, సొసైటీల చైర్మన్లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.