మన్యం న్యూస్ చర్ల:
ఆదివాసీలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగానే ఉంటుందని భద్రాచలం ఏఎస్పి పరితోజ్ పంకజ్ పేర్కొన్నారు.మంగళవారం చర్ల మండలంలోని మారుమూల అటవీ ప్రాంత గ్రామమైన కిష్టారంపాడును సందర్శించిన ఆయన గ్రామస్తులకు అవసరమైన దుప్పట్లు,నిత్యవసరాలు వంటసామాగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సీఐ రాజువర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…పోలీస్ శాఖ అన్ని వేళలా ఆదివాసీలకు అండగా ఉంటుందని ఆదివాసీ గ్రామాలలో విద్య,వైద్యంతో పాటు మౌలిక సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తుందని ఆయన అన్నారు.ఆదివాసీలను సంఘవిద్రోహక శక్తులైన మావోయిస్టులు వారి స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన పేర్కొంటూ సంఘవిద్రోహశక్తులకు ఎవరూ సహకరించవద్దని సూచించారు.మావోయిస్టులకు ప్రత్యక్షంగా గానీ,పరోక్షంగా గానీ ఎవరైనా సహకరించినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సైలు టివిఆర్ సూరి,నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.