- ఇది బస్టాండ్ ఆ బర్రెల కొట్టమా?.
- అంతా తూతూ మoత్రమే
- బస్టాండ్ మరమ్మత్తుల పనులను
- మసిపూసి మారేడు కాయ చేస్తున్న ఆర్టీసీ యాజమాన్యం.
- పర్యవేక్షణ లోపంతో శిధిలావస్థకు చేరుకున్న ఆర్టీసీ బస్టాండ్.
- పెద్దపెద్ద పగుళ్ళతో ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్న సిమెంట్ దిమ్మెలు.
- మరమ్మతులు మరిచి పగిలిన దిమ్మలపై కలరేపిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం.
- నానా తంట్టాలు పడుతున్న మండల ప్రజలు, మరియు ప్రయాణికులు.
మన్యం న్యూస్ నూగూర్ వెంకటాపురం.
వెంకటాపురం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ కు ప్రజలు రావాలంటే భయపడుతున్నారు. బస్టాండ్లో పైకప్పు మీద సువ్వలు బయటపడడంతో పెచ్చులు ఊడి ఎక్కడ మీద పడతాయో అని బిక్కుబిక్కుమంటూ ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి . గోడలతో పాటు కూర్చునే సిమెంట్ దిమ్మలు కూడా పగిలిపోయి ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బస్టాండ్ లో పనిచేసే కంట్రోలర్ కూడా పగిలిపోయిన నెర్రలను శిథిలావస్థకు చేరుకున్న బస్టాండ్ ను చూసి భయపడుతున్నాడు అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పనవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ యాజమాన్యం పర్యవేక్షణ లోపంతో మారుమూల ప్రాంతమైన వెంకటాపురం మండలం లో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం మూలాన శిథిలావస్థకు చేరుకుంది. అయితే గత కొన్ని రోజుల కిందట ఈ విషయo పట్ల మన్యం న్యూస్ పేపర్లో ప్రచురించిన కారణంగా ఆర్టీసీ యాజమాన్యం కదిలి వచ్చి మరమ్మత్తులు చేయకుండానే పనులు మొత్తం పూర్తి చేశాము అని ప్రజలను మభ్యపెట్టడానికి త్వరగా అయిపోయే పథకం అమలు చేసింది. ఎవరూ చూడరులే అనుకొని బస్టాండ్ లో ఎక్కడ పగుళ్ళు అక్కడే ఉంచి కలర్ వేసి చేతులు దులుపుకున్న పరిస్థితులను మన్యం న్యూస్ ప్రతినిధి తన కెమెరాలో బంధించారు. వెంకటాపురం, చర్ల, భద్రాచలం నుంచి మేడారంకు పోయే ప్రయాణికులు, .నిత్యం రాకపోకలు చేసే భక్తులకు ప్రయాణికులకు బస్టాండ్ ఆవరణంలో కాస్త సేదతీరుదామంటే అంటే పెను సవాల్ గా మారింది. కూర్చునే దిమ్మలకు పడిన పగుళ్లు వారిని బెంబేలెత్తిస్తున్నాయి. ప్రభుత్వాలు బస్టాండ్ మరమ్మతులకు నిధులు విడుదల చేసినప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం మాత్రం తన ఇష్టారాజ్యంగా బస్టాండ్ మరమ్మతులు చేయకుండా కలర్లు వేసి సరిపెట్టుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ విషయం పట్ల మండల ప్రజలు ప్రయాణికులు ఆర్టీసీ యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిత్యం వేలాది మంది తో రాకపోకలు వెంకటాపురం గుండా నడుస్తున్న నేపద్యంలో ఆర్టీసీ యాజమాన్యం వెంకటాపురం బస్టాండ్ మరమ్మత్తుల విషయం నిద్రమత్తు తో వ్యవహరిస్తుంది అని వారిపై మండిపడుతున్నారు. విడుదల చేసిన నిధులు ఖర్చు చేయడానికి చేతులు రావట్లేదా అంటూ వారి వారి నిర్లక్ష్యపు వైఖరి పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకనైనా నిద్రమత్తు వీడి ఆర్టీసీ యాజమాన్యం పగిలిపోయిన నెర్రలపై కలర్లు వేసుడు మాని సిమెంటుతో మరమ్మత్తులు చేసి పటిష్టమైన పని పూర్తి చేసి ప్రయాణికులకు బస్టాండ్ ను అందించవలసిందిగా కోరుతూ తూతూ మంత్రంగా వ్యవహరించిన తీరు పునర్వృత్తమైతే ఆర్టీసీ యాజమాన్యాలపై తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందంటూ మరమత్తులకు బదులుగా పెయింట్ వేసి కవర్ చేద్దాం అనుకున్న వారి ఆలోచనలను ప్రయాణికులు ఎండగడుతూ హెచ్చరించారు.. ఇకనైనా ఉన్నతాధికారులు ఈ విషయం పట్ల దృష్టి సారించి మరమ్మత్తుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని మండల ప్రజలు కోరుతున్నారు.