లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. నాగర్ కర్నూల్, మెదక్ ఎంపీ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను అధిష్టానం శుక్రవారం విడుదల చేసింది. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ ఎంపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిలను బరిలోకి దించింది.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మెదక్ లోక్ సభ నియోజకవర్గ ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో లోక్ సభ ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థిత్వంపై చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరు ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
ఇప్పటికే నాలుగు లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన అధిష్టానం తాజాగా మరో ఇద్దరు పేర్లను ప్రకటించింది. అయితే ఈ ఎన్నికల్లో ఊహించని పేర్లను బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటిస్తుండడంతో ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రకటించిన లోక్ సభ అభ్యర్థుల లిస్టులో కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర రావు. పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత పేర్లను ప్రకటించింది.
తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును ప్రకటించింది. తొలుత బీఎస్పీ అధినేతగా కొనసాగిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అనుహ్యంగా లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే బీఎస్పీ అధినేత మాయావతి దీనికి అంగీకరించకపోవడంతో ఆయన బీఎస్పీకి రాజీనామా చేశారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.