బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. తాను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే తెల్లారేసరికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. సోమవారం సిరిసిల్లలో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా పలు వార్డులలో ప్రచారం నిర్వహించారు. అనంతరం కార్నర్ మీటింగ్ లో పాల్గొని ఆయన ప్రసంగించారు.
పన్నులు, ట్యాక్సీలు వసూలు చేస్తే రాష్ట్రాలకు వాటా ఇవ్వవలసి వస్తదని ప్రధాని మోదీ.. సెస్ పేరుతో వసూల్ చేస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్ పై సెస్ విధించి రూ. 30 లక్షల కోట్ల వరకు దండుకున్నాడన్నారు. అందులో సగం అదానీ, అంబానీలకు పంచిపెట్టాడంటూ మోదీపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను చెప్పేది అబద్ధం అని కిషన్ రెడ్డి , బండి సంజయ్ లేదా బీజీపీ వాళ్లు ఎవరైనా నిరూపిస్తారా..? అని ప్రశ్నించారు. అబద్ధం అని నిరూపిస్తే తెల్లారేసరికి సిరిసిల్ల కొత్త బస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి సాక్షిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వారి మొఖానికి కొడుతానంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.
తనకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్లనే అని ఆయన అన్నారు. సిరిసిల్ల పట్టణాన్ని గత ఐదేళ్లలో అతి సుందరంగా అభివృద్ధి చేసుకోగలిగామని చెప్పారు. నేత కార్మికుల కోసం రూ. కోట్లు ఖర్చు చేసి వారిని కాపాడుకున్నామన్నారు. బీఆర్ఎస్ తరఫున ఎంపీగా బరిలో నిలిచిన వినోద్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేసిందా? అని ఆయన అన్నారు. అయితే, ఎర్రవల్లిలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయా లేదా అని అడుగుతున్నావ్ కదా.. ఒకసారి చీర కట్టుకుని బస్సెక్కు.. అప్పుడు నీకు అర్థమవుతుంది ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయో లేదో అనేది అని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఈ నెల 9 లోగా రైతుబంధు డబ్బులు వేస్తామన్నారు. ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటామని పేర్కొన్న విషయం తెలిసిందే.