జార్ఖండ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇద్దరిని అరెస్ట్ చేసింది. జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి (PA) సంజీవ్ లాల్, అతని ఇంటి పనిమనిషిని ఈడీ అరెస్ట్ చేసింది. సోమవారం (మే 6) జరిపిన దాడిలో రూ.34.23 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. రాంచీ వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది.
సోమవారం రాత్రంతా.. విచారించిన తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల ప్రకారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పిటిఐ వార్తా సంస్థ తెలిపింది. కాగా.. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలం.. తన పీఏ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. పీఏ అరెస్టును ఆయన ఖండించారు.
ఫిబ్రవరి 2023లో అరెస్టయిన జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కె రామ్‌పై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సోమవారం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాంచీలో లాల్ ఇంటి పనిమనిషి ఇంటిలో సోదాలు నిర్వహించింది. కొన్ని పథకాల అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో కేసు ముడిపడి ఉంది.
పనిమనిషి ఇంటి ఆవరణలో భారీ మొత్తంలో నగదు, ఆభరణాలను రికవరీ చేశారు. మరో ప్రదేశంలో రూ.3 కోట్లను గుర్తించారు. వీరేంద్ర కె రామ్.. కాంట్రాక్టర్లకు టెండర్ల కేటాయింపులకు బదులుగా వారి నుంచి కమీషన్ పేరుతో వసూళ్లు చేసినట్లు ఈడీ గతేడాది ఆరోపించింది. ఈ మేరకు సోదాలు చేయగా 34 కోట్ల రూపాయల నగదు లభ్యమైంది.