దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. ప్రధానంగా తెలుగు సినీ పరిశ్రమ నుంచే ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. ఇక్కడి హీరోలు చేసే నృత్యాలు, పోరాటాలు, డైలాగులన్నీ హిందీ హీరోలకు భిన్నంగా ఉండటంతో ఉత్తరాది ప్రేక్షకులకు తెలుగు హీరోలంతా భీభత్సంగా నచ్చేశారు. ఏ తెలుగు హీరో సినిమా విడుదలవుతున్నా థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి. యూట్యూబ్ లో సినిమా విడుదలైనా చాలు మిలియన్లకొద్దీ వీక్షణలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో తెలుగు స్టార్ హీరో రామ్ చరణ్, తమిళ స్టార్ హీరో సూర్య కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతోంది.
సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువ సినిమా చేస్తున్నారు. ఇది దాదాపు 14 భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా మంచి హిట్ సాధిస్తే సూర్య కూడా టాప్ మోస్ట్ పాన్ ఇండియా హీరో అయిపోతాడు. కంగువ దర్శకుడు శివ ఒక కథను సిద్ధం చేశారని, ఇది మల్టీస్టారర్ అని, ఇందులో సూర్య, రామ్ చరణ్ కలిసి నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ ఇద్దరు హీరోలు కలిసి మల్టీస్టారర్ చేయబోతున్నారంటూ కొద్దికాలం నుంచి వార్తలు వస్తున్నాయి కానీ అధికారికంగా ధ్రువీకరణ మాత్రం రావడంలేదు.
మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోందంటూ వార్తలు వస్తుండటంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సూర్య, రామ్ చరణ్ నటనను, యాక్షన్ సన్నివేశాల్లో వీరి నటనను ఉపయోగించుకునే సరైన కథ పడితే ఇండియన్ బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుందంటున్నారు. ప్రస్తుతం చెర్రీ గేమ్ ఛేంజర్ చేస్తున్నారు. తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఇటీవలే ఇది షూటింగ్ కూడా ప్రారంభించుకుంది. సూర్య కంగువ విడుదలైన తర్వాత వీరిద్దరి కాంబోపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.