UPDATES  

 పద్మ విభూషణ్ అందుకోవడానికి ఢిల్లీకి పయనమైన చిరు కుటుంబం..

మెగాస్టార్ చిరంజీవికి ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కిన విషయం తెల్సిందే. 2024 రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ ను ప్రకటించింది. చలన చిత్ర రంగంలో ఆయన చేసిన సేవకు గాను చిరుకు పద్మవిభూషణ్ గౌరవాన్ని అందించింది. ఇక చిరుతో పాటు 132 మంది ప్రముఖులను ఈ అవార్డులతో సత్కరించారు.

 

ఇక ఈ మధ్యనే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులను ఈ అవార్డులతో సత్కరించారు. అయితే ఆ రోజు కొన్ని కారణాల వలన చిరంజీవి ఆ వేడుకకు హాజరుకాలేకపోయాడు. దీంతో రేపు చిరుకు ఈ పద్మవిభూషణ్ ఇవ్వనున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును చిరుకు అందివ్వనున్నారు. దీంతో ఈరోజే చిరు కుటుంబం ఢిల్లీకి పయనమయ్యింది.

 

చిరు ప్రైవేట్ జెట్ లో ఢిల్లీకి పయనమయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. చిరుతో పాటు ఆయన భార్య సురేఖ.. కుమారుడు రామ్ చరణ్.. కోడలు ఉపాసన కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఇప్పటికే చిరుకు పద్మభూషణ్ ఇచ్చి సత్కరించిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు పద్మవిభూషణ్ ఇవ్వనుంది.

 

చిరుకు ఈ అవార్డులు, రివార్డులు కొత్తేమి కాదు. ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను చిరంజీవి అందుకున్నాడు. ఇక ఆ లిస్ట్ లో ఇప్పుడు కొత్తగా పద్మవిభూషణ్ వచ్చి చేరింది. ఇక చిరు సినిమాల విషయానికొస్తే వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విశ్వంభర పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన.. దాన్ని ఫినిష్ చేయగానే స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !