దాదాపు 50 రోజుల జైలులో గడిపిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలు నుంచి తొలిసారి ప్రజలను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా దేశంలోని 140 కోట్ల మంది కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
దేశాన్ని రక్షించుకునేందుకు ప్రజలంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం తన శక్తి మేరకు పోరాటం చేస్తానని వెల్లడించారు. తాను ఎంతగానో ఆరాధించే హనుమంతుడి ఆశీర్వాదంతో జైలు నుంచి బయటకు వచ్చానన్నారు. శనివారం ఉదయం కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటానని, తనను చూడాలంటే ప్రజలు అక్కడికి రావాలని సూచన చేశారు.
శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతానని వెల్లడించారు. నేరుగా ఇంటికి చేరుకున్న కేజ్రీవాల్‌కు ఇంటి వద్ద తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. శనివారం దక్షిణ ఢిల్లీలో రోడ్ షో జరగనుంది. దీనికి కేజ్రీవాల్ తోపాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా హాజరుకానున్నారు.
కేజ్రీవాల్ విడుదలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే రియాక్ట్ అయ్యారు. విజయవాడలో మాట్లాడిన ఆయన.. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని, న్యాయస్థానం ద్వారా రిలీఫ్ వచ్చిందన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఇలాంటి తప్పు చేయరాదన్నారు. అటు బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా స్పందించారు. కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పొందడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పరిణామం ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయానికి దోహదపడుతున్నారు.
అటు అధికార బీజేపీ పార్టీ కూడా స్పందించింది. ఇది రెగ్యులర్ బెయిల్ కాదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. ఆయన ప్రచారానికి వెళ్లిన ప్రతిసారీ మద్యం కుంభకోణం ఇష్యూ ప్రజలకు గుర్తుకు వస్తుందన్నారు.