తెలంగాణలో రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పంట నష్ట పరిహారం ఇంకా రాలేదు. వారం క్రితమే నిధులు విడుదల చేశామని ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ రైతుల ఖాతాల్లో ఇంకా డబ్బులు జమ కాలేదు. దీంతో ఎప్పుడు డబ్బులు ఖాతాలో జమ అవుతాయని రైతులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో మార్చిలో అకాల వర్షాలు కురిశాయి. దీంతో చాలా పంటలు నష్టపోయాయి. దీంతో ప్రభుత్వం పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించింది.
వ్యవసాయ అధికారులు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి వ్యవసాయ శాఖకు నివేదికి అందించారు. మార్చి 16 నుంచి 24 మధ్య రాష్ట్రంలోని పది జిల్లాల్లో వడగళ్ల వాన కురిసినట్లు నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,814 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలో వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పున చెల్లించేందుకు మొత్తం రూ.15.81 కోట్ల పరిహారం విడుదల చేసింది.
ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని మరి డబ్బులు విడుదల చేసింది. అయితే ఆ డబ్బులు ఇంకా రైతుల ఖాతాల్లో జమ కాలేదు. అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు ఎప్పుడ్ జమ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నికల ముందు డబ్బులు విడుదల చేసినట్లు చేసి.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి జమ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే రైతు రుణ మాఫీ చేయాలని కోరుతున్నారు.
వరి పంటకు బోనస్ ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆగస్ట్ లోపు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.