తెలంగాణలో మరో ఉప ఎన్నికకు సమయం అసన్నమైంది. మే 13న కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. లోక్ సభ ఎన్నికలతో పాటు ఈ ఉప ఎన్నిక కూడా జరిగింది. ఇప్పుడు మరో ఉపఎన్నిక జరగనుంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొదటగా 63 మంది నామినేషన్లు వేశారు. ఇందులో 11 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
మే 27న 12 జిల్లాలో పరిధిలో ఉప ఎన్నిక జరగనుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామ, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉప ఎన్నిక జరగనుంది. జూన్ 5న కౌటింగ్ ప్రారంభం అవుతుంది. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో మొత్తం 4లక్షల 61వేల 806 మంది ఓటర్లు ఉన్నారు. డిగ్రి పూర్తి చేసిన వారుఓటు వేసేందుకు అర్హులు.
అయితే పట్టభద్రులు అయిన వారు ముందుగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి ప్రేమేంద్ర రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక్కడ నుంచి ఎమ్మెల్సీ ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఎంపీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఉపఎన్నికపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీ కాలం 2027 మార్చి వరకు ఉంది.