భారత వాతావరణ శాఖ తాజాగా చల్లని వార్త చెప్పింది. మే 31 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని అంచనా వేసింది. నాలుగు రోజుల్లో రుతుపవనాలు దేశ భూభాగాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. దీంతో ఈ ఏడాది జూన్-సెప్టెంబర్ లో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. అయితే, సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ లో భారత దేశంలోకి ప్రవేశిస్తాయి. ఆ తరువాత ఉత్తరం వైపుగా ప్రయాణిస్తూ జులై 15 నాటికి దేశం మొత్తం ఆవరిస్తుంటాయి.
అయితే, వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు మే 31 నాటికి కేరళకు రానున్నాయి. అయితే, ఇప్పటికే మే 19న అండమాన్ నికోబార్ తీరాన్ని రుతుపవనాలు తాకనున్నాయని వాతావరణ శాఖ పేర్కొన్న విషయం తెలిసిందే.
మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ఊపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో పలు చోట్లా మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇంకొన్ని చోట్లా పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. జగిత్యాల, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, గద్వాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నారాయణపేట, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పలు చోట్లా ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం లేకపోలేదని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఆ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో మూడురోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.