UPDATES  

 తెలంగాణాకు వారంరోజులపాటు వానగండం..

తెలుగు రాష్ట్రాలలో ముందస్తు వానాకాలం వచ్చింది. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీ తర్వాత కాస్త చల్లబడే వాతావరణం ఈసారి ముందుగానే చల్లబడింది. రెండు తెలుగు రాష్ట్రాలలోను వర్షాలు కురవడం అందుకు కారణంగా మారింది. మే నెలలోనే వాతావరణం చల్లబడింది. గత రెండు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

 

మరో వారంరోజులు వర్షాలే రాష్ట్రవ్యాప్తంగా మరో వారం రోజులు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పిడుగులు పడే అవకాశం ఉందని, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. నిన్న సాయంత్రం కూడా హైదరాబాద్ సహా, అనేక జిల్లాలలో ఆకస్మిక వర్షాలు కురవడంతో ప్రజలు అనేకచోట్ల ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ వరంగల్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని, 22వ తేదీ వరకు ఈ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.అయితే మే 31వ తేదీన ముందస్తుగానే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.

 

క్యుములోనింబస్ మేఘాలతో కుండపోత వర్షాలు ఈసారి తీవ్రమైన ఎండలు నమోదు కావడంతో వర్షాలు కూడా అదే స్థాయిలో ఉండనున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సమయంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అకస్మాత్తుగా కుండపోత వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం తీవ్రమైన ఎండలు రాష్ట్రంలో లేనప్పటికీ, గత నెలలో నమోదైన ఎండల నేపథ్యంలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు అన్నదాతలకు కన్నీరు తెప్పిస్తున్నాయి.

 

ఇప్పటివరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నైరుతి ఋతుపవనాల ఆగమనానికి సానుకూల పరిస్థితులు ఏర్పడటంతో పాటు, ఆవర్తనాలు ఏర్పడుతున్న క్రమంలో వర్షాలు పడుతున్నాయి. ఇదిలా ఉంటే మార్చి నుంచి మే 18వ తేదీ వరకు రాష్ట్రంలో 51.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 66.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. తెలంగాణ రాష్ట్రంలోని 23 జిల్లాలలో ఇప్పటివరకు సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !