UPDATES  

 లోక్‌సభ ఐదో దశ పోలింగ్ ప్రశాంతం..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన 5వ దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ జరిగింది. ఈ విడతలో ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలు, మహారాష్ట్ర 13, పశ్చిమబెంగాల్‌ 7, బీహార్‌, ఒడిశాలో 5 చొప్పున, జార్ఖండ్‌ 3, జమ్మూకాశ్మీర్, లడఖ్‌లో ఒక్కో నియోజకవర్గంలో ఓటింగ్‌ జరిగింది. మొత్తం 695 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.

 

ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. సాయంత్రం 7 గంటల వరకు దాదాపు 57.38 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 73 శాతం, అత్యల్పంగా మహారాష్ట్రలో 48.88 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక, బీహార్‌లో 52.60 శాతం, జమ్మూకాశ్మీర్‌లో 54.49 శాతం, జార్ఖండ్‌లో 63.00 శాతం, లడఖ్‌లో 67.15 శాతం, ఒడిశాలో 60.72 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 57.79 శాతం నమోదైంది.

 

కాగా, ఎన్నికల సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో మొత్తంగా 543 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఐదో దశతో కలిపితే ఇప్పటి వరకు 428 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఈసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. నాలుగు దశల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 66.95 శాతం పోలింగ్ నమోదైంది.

 

ఓటు వేసిన ప్రముఖులు

 

అమేథీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గౌరీగంజ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, శివసేన నేతలు ఉద్ధవ్‌ఠాక్రే, వ్యాపారవేత్తలు రతన్‌ టాటా, ముకేష్‌ అంబానీ, అనిల్‌ అంబానీ తదితరులు కుటుంబాలతో కలిసి ఓటు వేశారు. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌, హాకీ ఇండియా చీఫ్‌ దిలీప్‌ టిర్కీ ఓటు వేశారు.

 

దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌, కుమారుడితో కలిసి ఓటు వేశారు. అజింక్య రహానే భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ నటులు అమితాబ్‌ బచ్చన్‌, జాన్వీ కపూర్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాకీ బాగ్నానీ, సంజయ్‌ దత్‌, మనోజ్‌ బాజ్‌పేయ్‌, అనిల్‌ కపూర్‌, హేమా మాలిని, దర్శకుడు జోయా అక్తర్ తదితరులు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

మరోవైపు, రాయ్‌బరేలీలో రాహుల్‌ గాంధీతో బీజేపీ నేత దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌ తలపడుతున్నారు. అమేథీలో స్మృతి ఇరానీ, కాంగ్రెస్‌ నేత కిషోర్‌ లాల్‌ శర్మ మధ్య పోటీ నెలకొంది. లక్నోలో రాజ్‌నాథ్‌సింగ్‌, సమాజ్‌వాదీ నేత రవిదాస్‌ మహరోత్రా ప్రత్యర్థులుగా ఉన్నారు. పియూష్‌ గోయల్‌, రోహిణి ఆచార్య, చిరాగ్‌ పాసవాన్‌, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌ వంటి ప్రముఖుల భవితవ్యం ఐదో విడతలో తేలనుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !