UPDATES  

 బెంగుళూరులో రేవ్ పార్టీ, టాలీవుడ్ నటీనటులు, ఏపీ మంత్రి కారు కూడా..

బెంగుళూరులో భారీ రేవ్ పార్టీ జరిగింది. దీనికి టాలీవుడ్ నటీనటులు, మోడల్స్ హాజరయ్యారు. తెల్లవారుజామున పోలీసుల సోదాల్లో వీరంతా అడ్డంగా దొరికి పోయారు. డ్రగ్స్‌తోపాటు ఏపీకి చెందిన ఓ మంత్రి కారు ఉండడంతో షాకవ్వడం పోలీసుల వంతైంది. అసలేం జరిగింది.. ఇంకా డీటేల్స్‌లోకి వెళ్తే..

 

బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీకి దగ్గరున్న ఉద్యాన్ నగర్‌లో భారీ ఎత్తున రేవ్ పార్టీ జరిగింది. ఓ నేత కొడుకు బర్త్ డేకు రేవు పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి టాలీవుడ్‌కి చెందిన నటీనటులతోపాటు మోడల్స్ రాజకీయ నేతల పుత్రరత్నాలు ఉన్నారు. రేవ్ పార్టీకి సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే తెల్లవారుజామున మూడుగంటల సమయంలో పోలీసులు దాడులు చేశారు.

 

పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్ పట్టుబట్టాయి. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తిదని పోలీసులు నిర్థారణకు వచ్చారు. ఏపీకి చెందిన ఓ మంత్రి పాస్ ఉన్న కారు అక్కడే ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సినీ ప్రముఖులు ఎవర్నది మాత్రం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

 

ప్రస్తుతం నార్కోటిక్స్ అధికారులు ఆ స్థలాన్ని తనిఖీలు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల మొదలై ఈ పార్టీ సోమవారం ఉదయం ఆరు గంటల వరకు ప్లాన్ చేశారు. హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా నటీనటులు బెంగుళూరు వైపు టర్న్ అయినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో దాదాపు 15 కార్లు ఉన్నాయి. అందులో మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్, ఆడి కార్లు లభ్యమయ్యాయి. ఈ పార్టీకి ఆదివారం ఒక్కరోజుకు 50 నుంచి 80 లక్షల వరకు వెచ్చించినట్టు అంతర్గత సమాచారం.

 

దర్యాప్తు మొదలుపెట్టిన బెంగుళూరు పోలీసులు తీగ లాగుతున్నారు. ఈ పార్టీ వెనుక ఎవరున్నారు? పెద్ద తలకాయలు ఎవరైనా ఉన్నారా? టాలీవుడ్ స్టార్స్ రావడంతో పార్టీ భారీ ఎత్తున జరిగిందని అంటున్నారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. ఇదిలావుండగా బెంగళూరు రేవ్ పార్టీలో తాను ఉన్నట్లు వస్తున్న వార్తలపై నటి హేమ స్పందించారు. అదంతా అబద్దమని తాను రేవ్ పార్టీలో లేనని చెప్పుకొచ్చారు. కావాలనే ఎవరో పుకార్లు లేపుతున్నట్లు చెప్పుకొచ్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !