తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో రైతులు వరి ధాన్యానికి రూ.500 బోనస్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే సన్న వడ్లకే బోనస్ ఇస్తామని ప్రకటించింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాము ఎక్కువగా దొడ్డు రకం వడ్ల పండిస్తామని.. సన్న రకం చాలా తక్కువ పండిస్తామని.. ఈ బోనస్ వల్ల ఉపయోగం లేదని చెప్పారు. సాధారణంగా తెలంగాణలో 80 శాతానికి పైగా దొడ్డు వడ్లు పండిస్తారు. సన్న రకం వడ్లు చాలా తక్కువగా పండిస్తారు. సన్న రకం వరికి ఎక్కువగా రోగాలు వస్తాయి. పైగా దిగుబడి తక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది అన్నదాతులు దొడ్డు రకం వడ్లను సాగు చేస్తుంటారు. ఇవి దిగుబడి కూడా బాగా వస్తాయి.
రూ.500 అన్ని రకాల వడ్లకు ఇస్తారని రైతులు భావించారు. కానీ ప్రభుత్వం కేవలం సన్న రకానికి మాత్రమే బోనస్ ప్రకటించింది. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం రైతులకు పంట నష్టపరిహారం విడుదల చేసినట్లు ప్రకటించినా.. రైతుల ఖాతాల్లో ఇంకా డబ్బులు జమ కాలేదు. గత మార్చి 16 నుంచి 24 మధ్య తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. దీంతో రైతులు పంటలు నష్టపోయారు.
దీనిపై వ్యవసాయ శాఖ నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. అకాల వర్షాలతో రాష్ట్రంలో 15 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది. దీంతో ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.15.81 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు, మూడు రోజుల్లో రైతు ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొంది. కానీ ఇప్పటి వరకు కూడా రైతులకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. దీనిపై వ్యవసాయ అధికారులను సంప్రదించగా.. బిల్లులు పంపామని ఆర్థిక శాఖ డబ్బులు విడుదల చేయాలని చెబుతున్నారు.