తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన చేస్తుందని బీఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామరావు మండిపడ్డారు. నేడు వనపర్తి జిల్లా,చిన్నంబావి మండలం,లక్ష్మి పల్లిలో హత్యకు గురైన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి మృత దేహం అంతిమయాత్రలో ఆయన పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నాయకుడి మృతికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత లక్ష్మి పల్లి గ్రామ బీఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి అంత్యక్రియల అనంతరం బీఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు మీడియా తో మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి మృతికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ ప్రేమ పూర్వక రాజకీయాలకు స్వాగతం పలుకుతున్నామని ప్రకటిస్తే, తెలంగాణ రాష్ట్రం లో మాత్రం కుట్రలు,దాడులు,హత్యల రాజకీయాలు చేస్తున్నారన్నారు.
జూపల్లి కృష్ణా రావును మంత్రిమండలి నుండి బర్తరఫ్ చెయ్యండి రాష్ట్రం లో లేని ఫ్యాక్షన్ రాజకీయాలకు తెర లేపుతున్నారని విమర్శించారు. శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రోత్సహించిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావును మంత్రి మండలి నుండి వెంటనే భర్తరఫ్ చేయాలనీ రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ పై తమకు నమ్మకం లేదన్నారు. వరుస హత్యలపైన ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని లేదా జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని అన్నారు.
హత్యా రాజకీయాలకు స్వస్తి చెప్పకుంటే ప్రతి దాడులు తప్పవు ఈ హత్యల్లో ప్రభుత్వ పాత్ర, మంత్రి పాత్ర లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరిగేందుకు సహకరించాలని కేటీఆర్ పేర్కొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం లో గడిచిన రెండు నెలల కాలంలో ఇద్దరు బీఅర్ఎస్ పార్టీ నాయకులు హత్యకు గురయ్యారని గుర్తు చేశారు.ప్రభుత్వం హత్య రాజకీయాలకు స్వస్తి చెప్పకుంటే,బీఅర్ ఎస్ పార్టీ కూడా ప్రతి దాడులకు దిగుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ తేల్చి చెప్పారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం, మంత్రుల ఇళ్ళు ముట్టడిస్తామని వార్నింగ్ మంత్రుల,ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తామనీ హెచ్చరించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, ఫిర్యాదు చేసినా వెంటనే చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. ఈ ఘటనలో ముందు ఎస్సై ని సస్పెండ్ చెయ్యాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తో పాటు,మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే లు బీరం హర్ష వర్ధన్ రెడ్డి,గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ హత్యా రాజకీయాలపై బీఅర్ఎస్ పార్టీ నేతలు,నాయకులు చిన్నంబావి మండలం కేంద్రంలో ధర్నా చేశారు.