లోక్ సభ ఎన్నికలు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ 5 విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరుగగా.. నేడు ఆరో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ జరగనుంది. మొత్తం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. హర్యానా 10, బీహార్ 8, జమ్ము కశ్మీర్ 1, ఝార్ఖండ్ 4, ఢిల్లీ 7, ఉత్తరప్రదేశ్ 14, ఒడిశా 6, పశ్చిమబెంగాల్ లో 8 స్థానాలకు ఆరో విడత ఎన్నికలలో భాగంగా పోలింగ్ జరుగుతోంది.
ఒడిశాలో లోక్ సభ ఎన్నికలతో పాటు.. 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కుతో తమ నాయకుడిని ఎన్నుకునేందుకు 7 గంటల నుంచే పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరారు. 58 నియోజకవర్గాల్లో 889 మంది అభ్యర్థులు పోటీ బరిలో ఉన్నారు. 5.84 కోట్ల మంది పురుష ఓటర్లు, 5.29 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే 5,120 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 11.13 కోట్ల మంది ఓటర్లు ఆరోదశ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
ఆరోదశ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ లక్ష 14 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంది. ఆయా పోలింగ్ బూత్ ల వద్దకు 11.4 లక్షల మంది అధికారులను పంపింది. పోలింగ్ నేపథ్యంలో.. ఢిల్లీ, ఫరీదాబాద్, గురుగ్రామ్ సహా అన్ని పోలింగ్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు సాయంత్రం 6 గంటల వరకూ మూతపడి ఉంటాయి.
ఆరోదశ ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో మనోహర్ లాల్ ఖట్టర్ (బీజేపీ): కర్నాల్, హర్యానా, బాన్సూరి స్వరాజ్ (బీజేపీ): న్యూఢిల్లీ, మనోజ్ తివారీ (బిజెపి) కన్హయ్య కుమార్ (కాంగ్రెస్): ఈశాన్య ఢిల్లీ, మేనకా గాంధీ (బీజేపీ): సుల్తాన్పూర్, ఉత్తరప్రదేశ్, దినేష్ లాల్ యాదవ్ (బిజెపి), ధర్మేంద్ర యాదవ్ (ఎస్పీ): అజంగఢ్, ఉత్తరప్రదేశ్, సంబిత్ పాత్ర (బిజెపి): పూరి, ఒడిశా ; నవీన్ జిందాల్ (బీజేపీ): కురుక్షేత్ర, హర్యానా ; రాజ్ బబ్బర్ (కాంగ్రెస్) రావ్, ఇంద్రజిత్ సింగ్ (బిజెపి): గుర్గావ్, హర్యానా ; అభిజిత్ గంగోపాధ్యాయ (బిజెపి): తమ్లుక్ సీటు, పశ్చిమ బెంగాల్ ఉన్నారు.
దేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలుండగా.. ఆరోదశతో 486 సీట్లకు పోలింగ్ పూర్తవుతుంది. ఢిల్లీ 7 లోక్ సభ స్థానాలు ఉండగా.. అన్ని స్థానాల్లోనూ ప్రధాన పోటీ బీజేపీ – ఆప్ ల మధ్య జరగుతుంది. ఏడుకు ఏడు సీట్లు కైవసం చేసుకుంటామని అటు కేజ్రీవాల్, ఇటు మోదీ నొక్కి చెప్పారు.