అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం
* 8 మృతదేహాలు లభ్యం
* హత్యలా? ఆత్మహత్యలా ఆన్న కోణంలో విచారణ
అమెరికాలో మంటల్లో తగలబడిపోతున్న ఇంట్లో 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఒక్లహామా రాష్ట్రంలోని బ్రోకెన్ యూరో పట్టణంలో జరిగిందీ ఘటన. మంటల్లో ఇల్లు కాలి బూడిద అవుతుండడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న ఇద్దరు పెద్దలు తొలుత పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నారా? లేదంటే, దుండగులు ఎవరైనా వారిని చంపి ఇంటిని తగలబెట్టి ఉంటారా? అన్న విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
చనిపోయిన చిన్నారులు 1 నుంచి 13 ఏళ్లలోపు వారేనని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం కారణంగా వీరు చనిపోయినట్టు కనిపించడం లేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఆ ఇంట్లో నుంచి పోలీసులు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, స్థానిక మహిళ ఒకరు మాట్లాడుతూ.. తాను కారులో వెళ్తున్న సమయంలో ఆ ఇంటి నుంచి దట్టమైన పొగలు రావడం కనిపించిందని అన్నారు. ఆ సమయంలో సృహలో లేని ఓ మహిళను ఓ వ్యక్తి ఈడ్చుకెళ్లడం కనిపించిందని పేర్కొన్నారు.