ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలు, కార్యాలయాలపై దాడులు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అధికారులు తాము జరిపిన సోదాల్లో భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 50 బృందాలుగా విడిపోయిన అధికారులు ఏకకాలంలో దాడులు చేయడం మల్లారెడ్డిని నివ్వెర పరిచింది. ఒక రకంగా చెప్పాలంటే కెసిఆర్ కూడా ఈ స్థాయిలో దాడులు జరుగుతాయని ఊహించి ఉండరు. బిజెపి ప్రభుత్వ పెద్దలు ఇది శాంపిల్ మాత్రమేనని… అసలు సినిమా ముందు ఉందని నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఐటీ అధికారులు పక్కా ప్రణాళికతోనే మల్లారెడ్డి ఆస్తులపై దాడి చేసినట్టు తెలుస్తోంది. దాడుల కోసం ఐటీ అధికారులు నాలుగు నెలలుగా కసరత్తు చేశారు. పకడ్బందీ సమాచారంతోనే ఈ తతంగం మొత్తం ముగించాలి అనుకున్నారు. అందుకే మల్లారెడ్డి విద్యాసంస్థల్లో ఐటీ సిబ్బందిని ఉద్యోగులుగా పంపించారు.. తనిఖీలకు కొద్ది రోజులు ముందుగా వారితో రాజీనామాలు చేయించారు.. గుట్టుమట్లు మొత్తం రాబట్టి తర్వాత తనిఖీలకు దిగారు. IT Raids On Malla Reddy పక్కా ప్రణాళిక మల్లారెడ్డి నివాసం, ఆయన విద్యాసంస్థలు, బంధువుల ఇళ్లల్లో దాడులకు ముందు ఐటీ శాఖ అధికారులు భారీ కసరత్తు చేశారు. వివిధ మీడియా మాధ్యమాలు రకరకాలుగా రాశాయి కానీ.. అసలు విషయం మేము లోతుల్లోకి వెళ్తే తెలిసింది. ఐటీ శాఖ అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారం సమాచారాన్ని, గుట్టుమట్లన్నీ పకడ్బందీగా సేకరించారు. ఆ తర్వాత దాడులకు సిద్ధమయ్యారు.. కేజీ నుంచి పీజీ దాకా 30 కి పైగా మల్లారెడ్డి కి విద్యాసంస్థలు ఉన్నాయి.. అయితే ఆదాయపు పన్ను శాఖ అధికారులు వాటిపైనే ప్రధానంగా దృష్టి సారించారు.. ఆయా విద్యాసంస్థల్లో నియామకాలను అవకాశంగా మలుచుకుని ప్రత్యేకంగా కొందరు అధికారులను వాటిలో సిబ్బంది గా చేర్పించారు.. చాలామందిని ఉద్యోగులుగా పంపించారు.. ఈ ప్రత్యేక ఆపరేషన్లో భాగం చేశారు.. ఆ విద్య సంస్థల్లో ఎక్కడ, ఏ వి భాగంలో చేరితే పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందో గుర్తించే కసరత్తు పూర్తిగా చేసిన తర్వాతే వారిని రంగంలోకి దింపారు. తమ శాఖలో కిందిస్థాయి సిబ్బందిని ఆ విద్యాసంస్థల్లో చేర్చారు.. వాటి పనితీరు, నిర్వహించే విధానం, అనుసరించే పద్ధతుల మీద ఆరా తీశారు.. వీటితోపాటు పలు విషయాల మీద పూర్తి అవగాహన పెంచుకున్నారు.. గట్టుమట్లన్నీ సేకరించడం పూర్తయిన తర్వాత, సోదాలకు కాస్త ముందు… ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా వారితో తమ ఉద్యోగాలకు రాజీనామా చేయించారు.. కింది స్థాయి సిబ్బంది కావడంతో ఎవరికీ ఎటువంటి అనుమానం రాలేదు. పద్ధతిగా సోదాలు ముందే వివరాలు మొత్తం తెలుసుకోవడంతో మల్లారెడ్డి విద్యాసంస్థలు, నివాసం లో ఐటీ దాడులు ఒక క్రమ పద్ధతిలో సాగాయి. ఎవర్ని ప్రశ్నించాలనే విషయం పైన కూడా ఐటీ అధికారులకు ఒక స్పష్టత వచ్చింది.
తనిఖీల సమయంలో ఎవరితో ఎలా వ్యవహరించాలనే విషయంపై కూడా పక్కా హోంవర్క్ చేశారు.. అయితే ఐటి శాఖకు చెందిన ముఖ్య అధికారుల్లో ఒకరు తమ కూతురికి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో మెడికల్ సీట్ అడ్మిషన్ కోసం వెళ్ళినప్పుడు చోటు చేసుకున్న పరిణామాలే తనిఖీల తీవ్రత ఎక్కువ అయ్యేందుకు కారణం అయ్యాయనే ప్రచారం కూడా జరుగుతోంది. IT Raids On Malla Reddy ఆ ల్యాప్ టాప్ ఎక్కడ మల్లారెడ్డి నివాసం వద్ద బుధవారం అర్ధరాత్రి నాటి హైదరాబాద్లో కీలకంగా నిలిచిన ల్యాప్ టాప్ అంశం ఇంకా తేలలేదు. బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్న ల్యాప్ టాప్ ను అటు మంత్రికి సంబంధించిన వారు కానీ, ఇటు ఐటి అధికారుల తరఫున వారు కానీ తీసుకెళ్లలేదు..ల్యాప్ టాప్ ను సైబరాబాద్ పోలీసులకు అప్పగిస్తామని సీఐ రవికుమార్ చెబుతున్నారు. కాగా సోదాలు ముగించుకుని వెళ్తుండగా తమ ల్యాప్ టాప్ ను మంత్రి వర్గీయులు లాక్కున్నారని ఐటీ శాఖ అధికారులు బుధవారం రాత్రి బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ వస్తువు ఏమైందో తేలాల్సిందేనని వారు మొండిపట్టు పట్టారు. అయితే అదే రోజు తెల్లవారుజామున కారులో మంత్రి అనుచరులు ఇద్దరు వచ్చి ఒక ల్యాప్ టాప్ తెచ్చారు. అయితే, వారు ఎత్తుకెళ్లిన వారు కాదని, అసలు ల్యాప్ టాప్ కూడా కాదని ఐటీ అధికారులు చెప్పారు. మరోవైపు ఐటీ అధికారులకు భద్రతగా వచ్చిన సిఆర్పిఎఫ్ సిబ్బంది ల్యాప్ టాప్ వెనక్కు తెచ్చిన ఇద్దరు సిబ్బందిని విచారించి, లాక్కెళ్ళిన వాళ్లే తెచ్చి ఇవ్వాలని మందలించారు. అయితే ల్యాప్ టాప్ తెచ్చిన వ్యక్తుల ముఖాలు సీసీటీవీ పుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించలేదు. అసలు దీంతో ఈ విషయంలో మంత్రికి, ఐటీ అధికారులకు మధ్య ఏం జరుగుతోంది అనేది మిస్టరీగా ఉంది..