నాడు చంద్రబాబు ఆశచూపారు.. రాజధాని వస్తుంది మీ భూములు బంగారం అవుతుందన్నారు. రాజధానిలో భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చి వారికి డబ్బులు ఇచ్చి అరచేతిలో ‘సింగపూర్’ను చూపించాడు. తమ బతుకులు బాగుపడుతాయని.. ఉద్యోగ, ఉపాధి దక్కుతుందని అమరావతి రైతులంతా తమ మూడు పంటలు పండే వ్యవసాయ భూములను ప్రభుత్వానికి తక్కువకే రాసిచ్చారు. చంద్రబాబు చూపించిన దారిలో ‘ప్రయోజనం’ పొందారు. అయితే రాజు మారితే రాజ్యమే మారిపోయిందన్న చందంగా చంద్రబాబు పోగానే అమరావతి కల చెదిరింది. రైతుల గుండె పగిలింది. అంతా అయిపోయింది. అమరావతి పోయి జగన్ సర్కార్ ‘మూడు రాజధానులు’ తీసుకొచ్చింది. అప్పటి నుంచి ‘అమరావతి’ రైతుల పోరు మొదలైంది. అమరావతిని బతికించుకునేందుకు రైతులు హైకోర్టుకు ఎక్కారు. అక్కడ అమరావతినే కొనసాగించాలని వాదించారు. రైతుల ఆక్రందన విన్న హైకోర్టు కూడా సరేనంది. అమరావతినే డెవలప్ చేయాలని సూచించింది.
కానీ జగన్ సర్కార్ మాత్రం నో అంటోంది. చంద్రబాబు.. ఆయన అనుయాయులు, కమ్మ వారు ఇక్కడ భూములు బాగా కొన్నారని.. వారి కోసం రాజధాని కట్టలేమంటూ జగన్ తన మనసు విశాఖపై పారేసుకున్నాడు. అక్కడికే రాజధాని షిఫ్ట్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే వైసీపీ నేతలు, విజయసాయిరెడ్డిలు అక్కడ విలువైన స్థలాలపై కన్నేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా చంద్రబాబు ‘అమరావతి’ని వ్యూహాత్మకంగా ప్రకటించి కమ్మ వారితో భూములు కొనిపిచ్చి అమరావతి రైతులు, అక్కడి గ్రామస్థులకు అరచేతిలో స్వర్గం చూపించాడు. రాజధాని వస్తుందని భూములిచ్చిన రైతుల కోసం ఆ ఐదేళ్లో పూర్తి చేయకుండా చంద్రబాబు నిర్లక్ష్యం చూపాడు. ఐదేళ్లలో బాబు కథ మారి ప్రతిపక్షంలోకి పోవడంతో జగన్ వచ్చాడు. ఇప్పుడు అమరావతిని కాలదన్నుతూ మూడు రాజధానులు అంటున్నాడు. లక్షలు , కోట్లు విలువ చేసే అమరావతి రాజధాని భూములకు విలువ లేకుండా చేస్తున్నాడు. చంద్రబాబు, జగన్ లు ఆడుతున్న ‘అమరావతి’ ఆధిపత్యపు ఆటలో పాపం ‘రైతులే’ సమిధలుగా మారారు. ఆటలో అరటిపండులు అయ్యారు. వీరి రాజ్యాధికార కాంక్ష, పంతాలకు రైతులు బలి అవుతున్న పరిస్థితి. కనీసం కోర్టులైనా అమరావతి రైతులకు న్యాయం చేయాలని అందరూ కోరుతున్నారు.