వైరస్‌లతో మనిషి సహజీవనం చేయాల్సిందే.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కుప్పలు తెప్పలుగా వైరస్‌లు వున్నాయి. వాటిల్లో కొన్ని మాత్రమే మనిషికి హాని చేస్తాయి. అందులోనూ చాలా కొన్ని మాత్రమే ‘కరోనా వైరస్’ తరహాలో ప్రపంచాన్ని వణికించగలవు. మనిషికి తెలిసిన వైరస్‌లు చాలా చాలా తక్కువ. తెలియనివే చాలా చాలా ఎక్కువగా వున్నాయంటారు పరిశోధకులు. తాజాగా ఓ వైరస్ ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వయసు ఏకంగా 45 వేల ఏళ్ళట. అయితే, ఇన్నేళ్ళుగా అది నిద్రాణంలోనే వుంది. అదిప్పుడు మేల్కొంది. అది కూడా మనిషి చేస్తున్న పాపం వల్లనే. రష్యాలోని మంచులా మారిపోయిన ఓ సరస్సు అడుగు భాగాన ఈ వైరస్‌ని కనుగొన్నారు.
జాబీ వైరస్.. ప్రపంచాన్ని ఏం చేస్తుంది.? భూమి ఉష్ణోగ్రత పెరుగుతోంది. దానిక్కారణం మనిషి. అడవుల్ని నరికేస్తున్నాడు.. ఇంకేవేవో చేస్తున్నాడు. ఈ కారణంగానే భూమ్మీద మంచు వేగంగా కరిగి పోతోంది. ఆ మంచు కింద మనిషికి తెలియని ఎన్నో సీక్రెట్స్ వున్నాయి. అవి క్రమంగా బయట పడుతున్నాయి. తాజాగా ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు కనుగొన్న జాంబీ వైరస్ కూడా ఆ మంచు కింద కప్పివేయబడిందే. ఆ వైరస్ గురించి తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఆ వైరస్ గనుక జంతువులకు లేదా పక్షులకు సోకితే.. ప్రపంచానికి పెను ప్రమాదమేనని అంటున్నారు. పాండోరా వైరస్ అని ప్రస్తుతానికి దీన్ని పిలుస్తున్నారు. జాంబీ వైరస్ అని కూడా అంటున్నారు.