ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తన పేరు చేర్చడంపై సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ‘జైల్లో పెడుతామంటే పెట్టుకోండి..
ఏమవుతుంది? భయపడేదేముంది? ప్రజలు మా వెంట ఉన్నంతకాలం.. ప్రజల కోసం టీఆర్ఎస్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నంతకాలం ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాదు’ అని కవిత స్పష్టం చేశారు. ఈడీ, సీబీఐలను ప్రయోగించి కాదు.. అత్యంత చైతన్యవంతమైన ప్రజలు ఉన్న తెలంగాణలో మీకు అది సాధ్యపడదు. కాదు కూడదు అంటే తేల్చుకుందాం అంటూ సవాల్ చేశారు. ప్రజాస్వామ్య యుతంగా ప్రజలకు మనమేం చేస్తామో చెప్పుకొని గెలవాలి అంటూ హితవు పలికారు..
లిక్కర్ స్కాంలో తన పేరు చేర్చడం వెనుక బీజేపీ కుట్ర ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆరోపించారు. హీన రాజకీయ ఎత్తుగడలో ఇవి భాగమన్నారు. ఎన్ని కేసులనైనా స్వాగతిస్తానని.. వీటికి భయపడనని తెగేసి చెప్పారు.
ఏ రాష్ట్రంలో ఎన్నికలున్నా అక్కడకు ఏడాది ముందుగా ఈడీ వస్తుంది. తర్వాత మోడ వస్తారు అంటూ ఏద్దేవా చేశారు. ఈడీ విచారణకు తాను సహకరిస్తాన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గమనిస్తున్నాం.
వచ్చే డిసెంబర్ లో తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ఉన్నందున మోదీ కంటే ముందు ఈడీ ఇక్కడికి వచ్చింది. నాపై , మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ కేసులు వేస్తోంది. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి విచారణకైనా మేం సిద్ధం అంటూ కవిత స్పష్టం చేశారు.