నాకు ఇవే చివరి ఎన్నికలు.. నన్ను మీరు గెలిపిస్తే సరే సరి.. లేదంటే అంతే..’ అంటూ మొన్నీమధ్యనే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, ఇంతలోనే ఆయన మాట మార్చేశారు. మాట మార్చడంలో, మడమ తిప్పడంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి సాటి ఇంకెవరూ రారు. తాజాగా ఆయన ఉమ్మడి పశ్చమగోదావరి జిల్లాలో పర్యటించిన సందర్భంలో ‘ఇదే చివరి ఛాన్స్.. మీరు గనుక మారకపోతే, రాష్ట్రాన్ని ఇక ఎవరూ మార్చలేరు.. మీరే పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి.. వైసీపీ కి అధికారమిచ్చారు.. రాష్ట్రం సర్వనాశనమైపోయింది. నేను చెబితే మీరు వినలేదు..’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించింది.
చంద్రబాబు చెప్పింది అదే కదా..! ‘వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని ఆగిపోతుందని చెప్పాను.. అదే జరిగింది. పోలవరం ప్రాజెక్టు ఆగిపోతుందని చెప్పాను.. అదే జరిగింది.. ఔనా.? కాదా.?’ అంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని ప్రశ్నించారు. నిజానికి, ఈ విషయంలో చంద్రబాబు చెప్పిందే నిజమైంది. అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని సాక్షాత్తూ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారు. అంతా బాగానే వుందిగానీ, రాజధాని అమరావతి ప్రాజెక్టుకి సంబంధించి తొలి దశను 2018 చివరి నాటికే పూర్తి చేస్తామని చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కూడా తన హయాంలోనే పూర్తవుతుందన్నారు. అవెందుకు అవలేదట?