షేయోని ఫారెస్ట్ రేంజ్ (Sheoni forest range)లో ఓ తల్లి పులి కళేబరాన్ని స్వాధీనం చేసుకుని మూడు రోజలు కూడా కాకముందే మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలోని తాడోబా టైగర్ రిజర్వు (Tadoba tiger reserve)లో నాలుగు పులి పిల్లలు (Tiger Cubs) చనిపోయి కనిపించాయి. శనివారం ఉదయం వీటిని గుర్తించినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మరణించిన పులి పిల్లల వయసు 3-4 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. తల్లి పులి కళేబరం కనిపించిన ప్రాంతంలోనే ఇవి కూడా కనిపించినట్టు తాడోబా-అంధారి టైగర్ రిజర్వు ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ జితేంద్ర రామ్‌గోయంకర్ పేర్కొన్నారు. చనిపోయిన పులి పిల్లల్లో రెండు మగవి కాగా, మిగతా రెండు ఆడవి.
అడవిలో ఇవి పుట్టినప్పటి నుంచి వాటిని పర్యవేక్షిస్తున్న షేయోని రేంజ్ ఫారెస్ట్ అధికారి సారథ్యంలోని ర్యాపిడ్ రెస్పాన్స్ టీం శుక్రవారం ఆ ప్రాంతానికి సమీపంలో ఓ మగ పులిని గుర్తించింది. చనిపోయిన నాలుగు పులి పిల్లలపై కొరికిన గాయాలు ఉన్నాయని, దీనిని బట్టి చూస్తే ఆ మగపులే వాటిని చంపి ఉంటుందని అనుమానిస్తున్నారు. పులి పిల్లల కళేబరాలను పోస్టుమార్టం కోసం చంద్రాపూర్‌లోని ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్ (TTC)కి తరలించారు. దేశంలోని పురాతన జాతీయ పార్కుల్లో తాడోబా ఒకటి. ఇది 1,727 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇందులో 120 పులులు, చిరుతలు, అడవి కుక్కలు, హైనాలు, అడవి పందులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు సహా అరుదైన వన్యప్రాణాలు ఉన్నాయి.