వచ్చే ఎన్నికల్లో పవన్ ఎవరితో కలుస్తారు? ఎవరితో పొత్తు పెట్టుకుంటారు? ఎక్కడ నుంచి పోటీచేస్తారు? ఈసారి రెండు చోట్ల పోటీచేస్తారా? లేక ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీచేస్తారా? అన్నది పార్టీలోనూ, బయట విస్తృతమైన చర్చ అయితే నడుస్తోంది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగినా నిరాశే ఎదురైంది. ఈసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా పవన్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. అయితే ఆయన పోటీచేసే నియోజకవర్గంపై మాత్రం స్పష్టత రావడం లేదు. అక్కడా? ఇక్కడా? అన్న ఊహాగానాలే తప్పించి పలానా చోట పోటీచేస్తానని పవన్ కానీ.. అటు జనసేన నేతలు కానీ ఎక్కడా చెప్పడం లేదు. కానీ పవన్ మాత్రం అటు పొత్తుల లెక్కలు ఒక కొలిక్కి వస్తే కానీ ఎక్కడ నుంచి పోటీచేసేది స్పష్టతనివ్వరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. Pawan Kalyan మరోవైపు పొలిటికల్ సర్కిల్ లో కొత్త టాక్ వినిపిస్తోంది.
పవన్ ఎంపీ, ఎమ్మెల్యగా పోటీచేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇది ఎలా సాధ్యమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పవన్ సీఎం కావాలనుకుంటున్నారు. అటువంటి నాయకుడు ఎంపీగా పోటీచేస్తే..అది దేనికి సంకేతం. ఆయన సీఎం ఆశలు వదులుకున్నట్టేనా? అన్న చర్చ సహజంగా మొదలవుతుంది. పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా నిర్ణయించుకుంటారే తప్ప..లేకుంటే అటువంటి డెసిషన్ తీసుకునే చాన్సే లేదని జనసేన వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అయితే ప్రచారం మాత్రం ఓ రేంజ్ లో నడుస్తోంది. పవన్ ఎమ్మెల్యేతో పాటు ఎంపీ పదవికి పోటీచేస్తారని ఒక టాక్ విస్తృతంగా నడుస్తోంది. పోనీ అదే నిజమైతే పవన్ ఎమ్మెల్యేగా ఎక్కడ నుంచి పోటీచేస్తారు? ఎంపీగా ఎక్కడ నుంచి బరిలో దిగుతారన్న ఊహాగానాలు, చర్చలు మొదలయ్యాయి, కోస్తాంధ్రలో జనసేన గ్రాఫ్ గణనీయంగా పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయన అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసే చాన్స్ ఉంది. ఇక ఎంపీకి సంబంధించి అనూహ్య నిర్ణయం తీసుకునే అవకాశముంది. తాను పోటీచేయడం ద్వారా ఆ ప్రభావం రెండు, మూడు జిల్లాలపై చూపేలా ఆయన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటారని తెలుస్తోంది.
ప్రధానంగా ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎంపీగా పోటీచేస్తారన్న ఒక కామెంట్ బయటకు వచ్చింది. సహజంగా రాయలసీమ అంటే వైసీపీకి పట్టున్న ప్రాంతం. అక్కడ బరిలో దిగి జగన్ అండ్ కోకు గట్టి సవాల్ విసరాలని పవన్ భావిస్తున్నారు. పొత్తులు, రాజకీయ లెక్కలు చూసుకొని పవన్ స్ట్రాంగ్ డెసిషన్ వచ్చినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ ను ఉదహరిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో ఆయన చాలాసార్లు అనంతపురం నుంచి హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీచేశారు. అటు తరువాత ఆయన కుమారుడు హరికృష్ణ, ఇప్పుడు బాలక్రిష్ణ అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. Pawan Kalyan ఎన్టీఆర్ తరహాలో పవన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో పవన్ పక్కా ప్రణాళికతో వెళుతున్నట్టు తెలుస్తోంది. ప్లాన్ ఏ, ప్లాన్ బీలను రూపొందించి అందుకు తగ్గ అడుగులు వేయాలని భావస్తున్నారుట. ప్లాన్ ఏ ప్రకారం టీడీపీ, బీజేపీతో కలిసి వెళితే 2014 రిజల్ట్ రిపీట్ అవుతుంది. అప్పుడు చంద్రబాబుతో పాటు పవన్ సీఎం రేసులో నిలుస్తారు. అందుకే కోస్తాంధ్ర నుంచి ఒక్క ఎమ్మెల్యే పదవికే పోటీచేస్తారు. ప్లాన్ బీ ప్రకారం టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుంది.
అప్పుడు పవన్ ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా పోటీచేస్తారు. కూటమి అధికారంలోకి వస్తే చెరి సగం సీఎం పదవి పంచుకునేందుకు ఒప్పందం చేసుకుంటారు. ముందుగా చంద్రబాబుకు చాన్సిస్తారు. తాను బీజేపీ నేతృత్వంలోని ఎన్టీఏలో చేరి కేబినెట్ మంత్రిగా పదవీ బాధ్యతలు చెలాయిస్తారు. ఒప్పందం ప్రకారం సీఎం పదవి బాధ్యతలు చేపట్టాల్సి వస్తే ఎంపీ పదవిని వదులుకుంటారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని గద్దె దించాలన్న కసితో పనిచేస్తున్న పవన్ అనూహ్య నిర్ణయాలు తీసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ పవన్ ను సీఎంగా చూడాలనుకుంటున్న లక్షలాది మంది అభిమానులు, జనసైనికులు ఈ నిర్ణయానికి ఎలా రియాక్టవుతారో చూడాలి మరీ..