నాన్-వెజ్ తినే వారికి మాంసాహారంలో చాలా ఆప్షన్లు ఉంటాయి. కానీ శాకాహారులకు ఏదైనా స్పెషల్ తినాలనుకుంటే ఏకైక ఆప్షన్ పనీర్. దీనితో వివిధ రకాల వంటకాలు చేసుకోవచ్చు. అయితే చాలా మంది పనీర్ మసాలా, పాలక్ పనీర్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఏ దాబాకు వెళ్లినా, రెస్టారెంట్‌కు వెళ్లినా, ఇంట్లో అయినా, పార్టీలో అయినా వెజిటేరియన్ మెన్యూలో పాలక్ పనీర్ ప్రధాన వంటకంగా ఉంటుంది. ఇప్పుడు విషయం ఏమిటంటే.. పాలకూర, పనీర్ ఈ రెండింటిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. అయితే ఇది మంచి ఫుడ్ కాంబో కాకపోవచ్చునని పోషకాహార నిపుణులు అంటున్నారు. న్యూట్రిషనిస్ట్ న్మామి అగర్వాల్ (Nmami Agarwal) ప్రకారం.. పాలకూర, పనీర్ కలిపి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉండవు.
పాలక్ పనీర్ ఎందుకు ఆరోగ్యకరం కాదో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కొన్ని కారణాలను పంచుకున్నారు. మధుమేహం సమస్య ఉన్నవారికి పనీర్ ఒక మంచి పోషకాహారం. అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్ అయిన పాలకూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ ఎ, ఇ, కె వంటి పోషకాలు లభిస్తాయి. ఇంకా ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మ క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. కానీ రెండింటిని కలిపి తినడం ద్వారా ఎలాంటి నష్టం ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి. Palak and Paneer Shouldn’t be Eaten Together పాలకూరలోని పోషకాలు వేరు, పనీర్ లోని వేరు. ఇవి విడివిడిగా తిన్నప్పుడు ఆ పోషకాలు శరీరానికి అందుతాయి. కానీ కలిపి తిన్నప్పుడు ఒకదానికొకటి పోషకాల శోషణను నిరోధించే కొన్ని కలయికగా మారుతుంది. పాలకూరలో ఐరన్ ఉంటుంది, అలాగే పనీర్ లో ప్రోటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అయితే ఇందులోని కాల్షియం అనేది ఇనుము శోషణను నిరోధిస్తుంది. పనీర్‌లో ఉండే కాల్షియం, పాలకూరలోని ఐరన్ శోషణను అడ్డుకుంటుంది. ఐరన్ లోపం వలన రక్తహీనత సమస్య తలెత్తుతుంది. హీమోగ్లోబిన్ స్థాయిలు తక్కువ ఉన్నవారు పాలక్ పనీర్ తినడం వలన నష్టమే తప్ప, ఎలాంటి ఆరోగ్య ప్రయోజనం ఉండదు.
అదే విధంగా ఎముకల దృఢత్వానికి, దంతాల ఆరోగ్యానికి కాల్షియం అవసరం. పాలకూరలో అధిక సాంద్రతలలో కనిపించే యాంటీ న్యూట్రియంట్ మాలిక్యూల్, శరీరం కాల్షియంను గ్రహించకుండా అడ్డుకుంటుంది. అందువల్ల పాలక్- పనీర్ కలిపి తినడం ద్వారా ఈ రెండు ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందవు అని న్మామి తెలిపారు. ఆయుర్వేదంలో కూడా విరుద్ధ ఆహారం అనే పదం ఉంది. అంటే కొన్ని ఆహార పదార్థాలను కలిపి తినకూడదని అర్థం వస్తుంది. ఈ కోవలో అరటిపండు – పాలు, చేపలు- పాలు, తేనె – నెయ్యి , పెరుగు – జున్ను వంటి కొన్ని కలయికలు కూడా విరుద్ధ ఆహారంగా పరిగణిస్తారు. టోమాటో, పాలకూర ఒకచోట కలిపి వండటం వలన ఈ రెండింటి కలయికతో వచ్చే పోషకాలు కిడ్నీలలో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతాయని ఒక బలమైనా వాదన ఉందనే విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు పాలక్ పనీర్ కూడా పోషకాల సంశ్లేషణను అడ్డుకుంటుందని చెప్పడం గమనార్హం.