కన్నడ హీరో దర్శన్‌పై ఇటీవల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆయన నటించన క్రాంతి సినిమా పాట విడుదల కార్యక్రమంలో భాగంగా హోస్ పేటలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌లో ఓ వ్యక్తి క్రాంతి టీమ్‌పై చెప్పు విసిరాడు. అది దర్శన్‌కు తగలింది. దీంతో అక్కడ చిన్నపాటి గొడవ జరిగింది. దర్శన్‌పై ఈ విధంగా దాడి జరగడంతో కన్నడ చిత్ర నటీనటులు, ఆయన స్నేహితులు విచారం వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతు ఇస్తూ దాడిని తీవ్రంగా ఖండించారు. తాజాగా ఈ అంశంపై దర్శన్ స్పందించారు. తనకు అండగా నిలిచిన స్నేహితులకు ట్విటర్ వేదికగా ధన్యవాదాలు చెప్పారు. “ఈ సమయంలో నా కంటే నా సహ నటీనటులే ఎక్కువగా బాధపడుతున్నారని అర్థమైంది. ఇలాంటి ఘటనలు ఒక మనిషిని బలహీనపరచవు. ఇంకా మరింత దృఢంగా మారుస్తాయి. మన సొంత కన్నడ నేలపైనే ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు చూశాం. న్యాయం కోసం నిలుచున్న స్నేహితులు, నటీనటులకు ధన్యవాదాలు. సినిమా ఈవెంట్‌ను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించిన వాళ్లకు కృతజ్ఞతలు.
ఒక కార్యక్రమాన్ని నాశనం చేయడానికి వంద మంది వ్యక్తులు ఉంటే.. కొన్ని వేల మంది సెలబ్రెటీలు రంగంలోకి దుగుతారని నేను మొదటి నుంచి చెబుతున్నాను. అదే జరిగింది. నాపై పలువురు వ్యక్తులు కనబరుస్తోన్న ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.” అని దర్శన్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం దర్శన్ నటించిన క్రాంతి సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో వేదికపై చిత్రబృందం ప్రసంగిస్తున్న తరుణంలో ఓ వ్యక్తి దర్శన్‌పైకి చెప్పు విసిరాడు. ఆ వీడియో సోషల్ మీడియా వైరల్ అయింది. ఆ దాడికి కాసేపు దర్శన్, పునీత్ రాజ్ కుమార్ అభిమానులు సభా ప్రాంగణంలో గొడవ పడ్డారని, కాబట్టి పునీత్ అభిమానులే ఇలా చేశారని వార్తలు వచ్చాయి. దర్శన్‌పై దాడి చేయడం పట్ల పలువురు కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా చేయడం హేయమని చర్యని స్పష్టం చేశారు. కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ తదితర కన్నడ నటీనటులు దర్శన్‌కు మద్దతు పలికారు. దర్శన్‌పై దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంచో నెటిజన్లు కూడా విశేషంగా స్పందించారు.