ఏపీలో మద్య నిషేధం అన్నది లేదిక. మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తున్న ప్రభుత్వాలు నిషేధించలేమని తేల్చేశాయి. గత ఎన్నికల్లో మద్య నిషేధం అమలుచేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పుకొచ్చారు. మద్యంతో కుటుంబాలు అధోగతి పాలవుతున్నాయని.. టీడీపీ ఏలుబడిలో ఊరూరా బెల్ట్ దుకాణాలు వెలిశాయని కూడా అప్పట్లో ఆరోపించారు. అక్క చెల్లెళ్ల కన్నీటిని తుడిచేందుకు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్య నిషేధం అమలుచేస్తామని ప్రకటించారు. ఆ హామీతో దండిగా ఓట్లు దండుకున్నారు. తీరా పవర్ లోకి వచ్చాక అమలు సాధ్యం కాదని తేల్చేశారు. మద్యం షాపులను టేకోవర్ చేసుకొని సొంతంగా నడపడం ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మద్యం విక్రయాలు కొన్నిరోజులు జరగక తప్పదని మడత పేచీ వేశారు. ఏడాదికి 25 శాతం షాపులనుతగ్గించి.. నాలుగేళ్లలో సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగులు వేస్తానని.. మద్యం ధరలు పెంచి ఫైవ్ స్టార్ హోటల్ కే పరిమితం చేస్తానని కూడా చెప్పారు.
ఆయన చెప్పినట్టు ఏడాదికేడాది షాపులు తగ్గలేదు. బార్లు,, వాకిన్ స్టోర్ ల పేరిట పెరిగాయే తప్ప తగ్గలేదు. దీంతో జగన్ సంపూర్ణ మద్య నిషేధం చేస్తారన్నది ఉత్తమాటగా తేలిపోయింది. Jagan- Chandrababu జగన్ ఫెయిల్యూర్స్ ను ప్రస్తావించి.. తాను అధికారంలోకి వస్తే చక్కదిద్దుతానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ ఒక మద్యం విషయంలో మాత్రం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. మద్య నిషేధం అమలుచేస్తానని చెప్పడం లేదు. కానీ మద్యం షాపులుంటాయని సంకేతాలిస్తున్నారు. అందులో మార్పులు చేర్పులు చేస్తానని ఇండైరెక్ట్ గా చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు కల్లుగీత కార్మికులకు ఒక హామీ ఇచ్చారు . తాను అధికారంలోకి వస్తే మద్యం షాపుల్లో 10 శాతాన్ని కల్లుగీత కార్మికులకు కేటాయిస్తానని చెప్పారు. అంటే మద్య నిషేధం లేనట్టే కదా. ఆయన మాటల ద్వారా తప్పకుండా మద్యం షాపులు ఉంటాయని.. పాలసీనే మార్చతానని చెప్పినట్టయ్యింది.