చింతపండుతో చారు చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, పులిహోర కలిపేయొచ్చు, కుదిరితే చింతపండు జ్యూస్ ట్రై చేయవచ్చు. కానీ మీరెప్పుడైనా పుల్లటి చింతతో చాయ్ చేసుకోవచ్చని ఊహించారా? కానీ లెమన్ టీ లాగే టామరిండ్ టీ కూడా అందుబాటులో ఉంది. ఈ టామరిండ్ టీ చేయడానికి చింతాకులను ఉపయోగిస్తారు. చింతపండుతో చేసే వంటకాలు కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ తో ఎంత రుచికరంగా ఉంటాయో మీకు తెలుసు అదే విధంగా ఈ చింతాకు టీ కూడా కొంచెం తీపి, పులుపు కలగలిసిన రుచితో ఉంటుంది.
అయితే ఈ చింతాకు టీ రుచికే కాదు, ఆరోగ్య ప్రయోజనాలకూ ప్రసిద్ధి. చింత ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ మలేరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఆస్తమా గుణాలు ఉన్నట్లు కనుగొన్నారు. కాబట్టి ఇన్ని మూలకాలు కలిగిన చింతాకు టీ తాగటం ద్వారా కాలేయం, పొట్టను శుభ్రపడటమే కాకుండా, మీ బరువు తగ్గించండంలోనూ ప్రయోజనం పొందవచ్చు. చింతాకు టీ తాగటం ద్వారా కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకునేముందు, అసలు ఈ చింతాకు టీని ఎలా తయారు చేయవచ్చో తెలుసుకుందాం. చింతాకు టీ రెసిపీ ఈ కింద ఉంది చూడండి.