కేసీఆర్ కుటుంబంతో పవన్ కళ్యాణ్ కు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కానీ జనసేనను టార్గెట్ చేసుకొని కేసీఆర్ రాజకీయం చేయడం ఏమిటన్న ప్రశ్న ఒకటి తలెత్తుతోంది. ఏపీలో తన బీఆర్ఎస్ విస్తరణకు జనసేన నేతలను పార్టీలోకి ఆహ్వానించడంపై రకరకాల చర్చ అయితే జరుగుతోంది. తోట చంద్రశేఖర్ కు అటు ప్రజారాజ్యంలో చిరంజీవి, జనసేనలో పవన్ కళ్యాణ్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అటువంటి వ్యక్తి చెప్పా పెట్టకుండా బీఆర్ఎస్ లోకి దూకేస్తారా? అన్నది ప్రశ్నార్థకం. ఆయన పవన్ కు చెప్పే పార్టీ చేంజ్ అయి ఉంటారన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీతో పొత్తులో ఉన్న సమయంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ తరుపున దివంగత పీవీనరసింహరావు కుమార్తె పోటీచేశారు. మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి చెప్పి మరీ పవన్ కళ్యాణ్ ఆమెకు మద్దతు ప్రకటించిన సందర్భాలున్నాయి. అంతేకాదు అవకాశం వచ్చినప్పుడు కేసీఆర్ పాలనను పవన్ పొగుడుతుంటారు. పవన్ సినిమా ఫంక్షన్లకు కేటీఆర్ హాజరవుతుంటారు.
ఏపీ రాజకీయాల్లో పవన్ ఉన్నత స్థానానికి వెళ్లాలంటూ ఆకాంక్షిస్తుంటారు. అటువంటిది పవన్ పార్టీలోని కీలక వ్యక్తి చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో కి గోడ దూకడం వ్యూహాత్మకమా.. లేకుంటే ముందస్తు ప్రణాళికా? ఇప్పుడిదే తెలుగునాట హాట్ టాపిక్. AP BRS leaders అయితే గత ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరి పోరుకే బీజేపీ మొగ్గుచూపింది. పవన్ అవసరం లేకుండానే పోరాడుతామని.. అధికారంలోకి వస్తామని.. లేకుంటే ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తామని బీజేపీ నేతలు భావించారు. అందుకే 2018లో కోలుకోలేని దెబ్బతిన్నారు. నాడు పవన్ బలాన్ని చాలా తక్కువగా అంచనా వేశారు. చివరి వరకూ మిత్రపక్షంగా చూసి .. తీరా ఎన్నికల నాటికి ఒంటరిపోరుకే మొగ్గుచూపారు. అందుకే పవన్ దానిని ఒక అవమానకర చర్యగా భావించారు. కానీ ఎక్కడా బయటపెట్టలేదు. తెలంగాణలో బలోపేతం అవుతున్నామని భావించి బీజేపీ జనసేనను చేజేతులా దూరం చేసుకుంది. మూల్యం చెల్లించుకుంది. నాడు జనసేన సైలెంట్ కావడంతో అధికార టీఆర్ఎస్ పైచేయి సాధించగలిగింది. ఎన్నికల అనంతరం ఏపీలో జనసేనను బీజేపీ మిత్రపక్షంగా చేర్చుకుంది. ప్రతిపక్ష టీడీపీ అన్నివిధాలా ఫెయిలైనందున ఆ స్థానాన్ని ఇరు పార్టీలు కలిసి భర్తీ చేద్దామని ప్రకటించింది. కానీ రెండు పార్టీలు కలిసింది లేదు. కలిసి పోరాడింది లేదు. అయితే పవన్ వైసీపీని ఓడించేందుకు అవసరమైతే అందర్నీ ఒకేతాటిపైకి తెస్తానని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని ప్రకటించారు. పొత్తులకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. టీడీపీ, జనసేనల మధ్య మంచి సానుకూల వాతవరణం ఏర్పడింది. అటు బీజేపీ కూడా ఏదో నిర్ణయానికి రాక తప్పని పరిస్థితి అనివార్యంగా మారింది. అయితే ఓటు చీలిపోనివ్వనని పవన్ ప్రకటించిననేపథ్యంలో జనసేనలో యాక్టివ్ పాత్ర పోషిస్తున్న కాపు సామాజికవర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ తనవైపునకు తిప్పుకున్నారు.