మన్యం న్యూస్, భద్రాచలం , జనవరి 05 :
నిషేధిత మావోయిస్టు పార్టీ సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్న ఇద్దరు కొరియన్లను అరెస్టు చేసినట్లుగా భద్రాచలం ఏఎస్ పి రోహిత్ రాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ సిబ్బంది చర్ల పట్టణ శివారు లక్ష్మీ కాలనీలో నిర్వహించిన వాహన తనిఖీలో పల్లపు సమ్మయ్య, పల్లపు సత్యవేణి అనే ఇద్దరు నిషేధిత మావోయిస్టు పార్టీ కొరియర్లను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. అరెస్ట్ కాబడిన ఇద్దరు గత రెండు సంవత్సరాలుగా భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్ దళానికి కొరియన్లుగా పని చేస్తూ, పార్టీకి అవసరమయ్యే నిత్యవసర వస్తువులను, పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. మావోయిస్టు పార్టీ నాయకుల ఆదేశాల ప్రకారం వీరు ఇరువురు కొంతమంది వ్యక్తుల సహాయంతో కార్డెక్స్ వైర్, మందు పాత్రను తయారు చేయడానికి అవసరమయ్యే ప్రెషర్ కుక్కర్లు, ఇతర విధ్వంసకర పేలుడు పదార్థాలను తయారు చేయడానికి అవసరమయ్యే రసాయనిక పదార్థాలను నిషేధిత మావోయిస్టు పార్టీకి చేరవేస్తున్న క్రమంలో వీరు పోలీసులకు పట్టుబడినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన కొరియన్ల వద్ద నుండి 200 మీటర్ల పొడవైన కార్డెక్స్ వైర్ బండల్, 12 లీటర్ల సామర్ధ్యం గల ప్రెషర్ కుక్కర్లు, పేలుడు పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే రసాయనిక పదార్థాలను, వాటిని తరలించడానికి ఉపయోగిస్తున్న ట్రాక్టర్, ట్రాలీ లను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పి ప్రకటనలో పేర్కొన్నారు. అరెస్టు కాబడిన వారిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం భద్రాచలం కోర్టు నందు ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ, వారితో సంబంధం ఏర్పరచుకొని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏఎస్పి తెలిపారు.