మన్యం న్యూస్, అశ్వారావుపేట, జులై, 21: మణిపూర్లో కుకీ గిరిజన మహిళలపై సామూహిక అత్యాచారం జరిపి, వారిని నగ్నంగా ఊరేగించి, ముగ్గురు మహిళలను హత్య చేసిన కిరాతకం, అనాగరికతకు బీజేపీ, ప్రధాన మంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షాలే బాధ్యత వహించాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కమిటీ సభ్యులు పోతుగంటి లక్ష్మణ్ అన్నారు. మెజారిటీ వారిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోడానికే బీజేపీ పథకం ప్రకారమే వంద రోజులుగా ఈ అల్లర్లకు పూనుకున్నదని, కిరాతకాలను చేస్తున్నదని, ఇది బీజేపీ ఫాసిస్ట్ అజెండాలో బాగమేనని లక్ష్మణ్ అన్నారు. మణిపూర్లో శాంతి నెలకొల్పాలని, నాగాలకు, కుకీ గిరిజన జనాలకు భద్రత కల్పించాలని, అల్లర్ల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, హెూం మంత్రి అమిత్ షాపై విచారణ చేయాలని, అల్లర్ల బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేసారు. అల్లర్లపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని, మణిపూర్లో గిరిజనుల పట్ల, మహిళల పట్ల సంఘ పరివారీయులు చేస్తున్న దుర్మార్గాలు, అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు