*హరిప్రియకు టికెట్ ఖరారు చేయటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు
*టికెట్ సాధించి నియోజకవర్గానికి విచ్చేసిన హరిప్రియకు గజమాలతో ఘనస్వాగతం పలికిన నాయకులు*
*భారీబైక్ ర్యాలీతో ఇల్లందుకు చేరుకున్న ఎమ్మెల్యే హరిప్రియ* *నన్ను నమ్మి నాతో నడిచిన ప్రజలు, నాయకులకు కృతజ్ఞతలు* *ఇల్లందు చరిత్రను మార్చేలా గులాబీజెండా ఎగరేసి కేసీఆర్ కు కానుకగా ఇస్తాం* *ఎమ్మెల్యే హరిప్రియ నాయక్* *మన్యంన్యూస్,ఇల్లందు*:తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎలక్షన్లలో ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియను సీఎం కేసీఆర్ ఖరారు చేయటంతో ఇల్లందు నియోజకవర్గ ప్రజలు, పార్టీ క్యాడర్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. గులాబీశ్రేణుల సంబరాలు నియోజకవర్గవ్యాప్తంగా మిన్నంటాయి.బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో తన పేరు రావడంతో మంగళవారం నియోజకవర్గానికి విచ్చేసిన ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ కు బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిదులు బయ్యారంలో భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు. బయ్యారం మండలం నుండి భారీబైక్ ర్యాలీతో ఎమ్మెల్యే కాన్వాయ్ ఇల్లెందు పట్టణానికి చేరుకుంది. ర్యాలీ ద్వారా పట్టణానికి చేరుకున్న ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పట్టణంలోని స్థానిక కొత్తబస్టాండ్ వద్దగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కొమురంభీంల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. మున్సిపల్ పాలకవర్గ కౌన్సిలర్స్, మహిళా కమిటీ, పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో కలిసి భారీర్యాలీగా ప్రజలకు అభివాదం చేస్తూ జగదాంబ సెంటర్ కు ఎమ్మెల్యే చేరుకున్నారు. అనంతరం తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మీద నమ్మకంతో మరోసారి ఇల్లందు నియోజకవర్గము నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీశ్రేణుల అందరి సహాకారంతో రాబోవు ఎలక్షన్లో హరిప్రియని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. అనంతరం ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ..ముందుగా తనమీద నమ్మకంతో తనకు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇల్లందు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లామంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మంత్రి తన్నీరు హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీనాయకుల సహకారంతో ఇల్లందు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మరోమారు ఇల్లందు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం కచ్చితంగా జరుగుతుందని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ధీమా వ్యక్తంచేశారు. ఇల్లందు చరిత్రను తిరగరాసేలా ఇల్లందు గడ్డపై గులాబీజెండా ఎగురవేసి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇస్తామని ఎమ్మెల్యే హరిప్రియ పేర్కొన్నారు. ఎవరెన్ని కుటిల ప్రయత్నాలు చేసినప్పటికీ కష్టసమయంలోనూ నాకు తోడుగా ఉన్న ప్రజలకు, నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో గెలిచి ఇల్లందు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే అభివృద్ది చెందిన నియోజకవర్గాల్లో ఇల్లందును ఒకటిగా చేస్తానని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ దిండిగల రాజేందర్, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, శీలం రమేష్, మహిళ అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, ఉపాధ్యక్షురాలు చంద్రావతి, మహిళా నాయకురాళ్లు ఖమ్మంపాటి రేణుక, భాగ్య, పట్టణ ఉపాధ్యక్షులు అబ్దుల్ నబీ, పాషా, ఎమ్మార్పీఎస్ నాయకులు మేకల శ్యామ్, పార్టీ బయ్యారం ఉపాధ్యక్షుడు తిరుమలరెడ్డి, బయ్యారం, గార్ల, ఇల్లందు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, నాయకులు, ప్రజాప్రతినిదులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.