దక్షిణ కొరియాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. కిమ్ ప్రభుత్వం ఓ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఇటీవల ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. సరిహద్దుల్లో లైవ్ ఫైర్ డ్రిల్స్ నిర్వహించడం దీనికి కారణమైంది.
ఈ పరిణామాల నడుమే కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం ఓ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దాదాపు నెల రోజుల వ్యవధిలో ఇది మొదటి మిసైల్ ప్రయోగం. దక్షిణ కొరియా సైన్యం దీన్ని ధ్రువీకరించింది. జపాన్ రక్షణశాఖ సైతం ఈ విషయాన్ని వెల్లడించింది. చివరి సారి గతేడాది డిసెంబరు 18న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించింది.
కిమ్ జోన్ ఉన్ బలగాలు ఇటీవల పశ్చిమ తీరంలో పెద్దఎత్తున పేలుళ్లు జరుపుతూ సైనిక విన్యాసాలు నిర్వహించాయి. దీంతో కొరియా ద్వీపకల్పం వేడెక్కింది. దక్షిణ కొరియా సైతం దీటుగా సమాధానం చెప్పింది. వాషింగ్టన్, సియోల్‌లు కవ్వింపు చర్యలకు పాల్పడితే వాటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని నూతన సంవత్సరం సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ తన సైన్యానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఏప్రిల్‌లో దక్షిణ కొరియా పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఉత్తర కొరియా మరిన్ని క్షిపణి ప్రయోగాలు చేపట్టే అవకాశం ఉందని సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.