గుంపు మేస్త్రీ దావోస్లో అన్నీ అబద్ధాలే చెప్పాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కరీంనగర్లో సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు రైతులు సహా ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడుతున్నారన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజుల్లో రైతుబంధు వస్తుండెనని… గుంపు మేస్త్రి పాలనలో ఇప్పటి వరకు దిక్కులేదని రైతులు వాపోతున్నారన్నారు. సీఎం పదవికి అనుభవం ఉందా? అని రేవంత్ రెడ్డిని అడిగితే అప్పుడేం చెప్పారో గుర్తు చేసుకోవాలని చురక అంటించారు. తాము రైతు భరోసా ఇస్తున్నామని దావోస్లో రేవంత్ చెప్పారని… కానీ రైతు భరోసా అంటే రూ.15,000 ఇవ్వాలన్నారు. కానీ రైతుబంధుకు ఇచ్చినట్లుగానే ఇస్తున్నారని గుర్తు చేశారు.
రైతుబంధు పడటం లేదని ఎవరైనా అంటే చెప్పుతీసి కొడతానని నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారని.. ఇది మన గౌరవ మంత్రి చెప్పే మాట అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న కూడా అదే మాట అంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రైతుబంధు పడని రైతులు ఆలోచించాలని కోరారు. చెప్పుతో మీరు కొడతారా? ఓటుతో కొడతారా? మీ ఇష్టం… కానీ వారంలో రైతుభరోసా అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు వేయలేదన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓటుతో కొట్టడం ఖాయమన్నారు.