కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ అగ్రనేత , భారత్ మాజీ ఉపప్రధాని ఎల్ కే అద్వానీకి భారత అత్యన్నుత పురస్కారం భారతరత్న ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని Xలో వెల్లడించారు. అద్వానీకి భారతరత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
అద్వానీతో మోదీ మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధిలో అద్వానీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయనకు భారతరత్న దక్కడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. ఎల్కే అద్వానీ రాజనీతిజ్ఞుడిగా పేర్కొన్నారు.
సాధారణ స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఎల్ కే అద్వానీ ఎదిగారని మోదీ కితాబిచ్చారు. అనేక కేంద్ర మంత్రి పదవులు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు. పార్లమెంట్లో ఆయనకు ఎంతో అనుభవం ఉందని వివరించారు.
అద్వానీ రాజకీయ జీవితం నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు. జాతి ఐక్యత, సాంస్కృతి పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా ఆయన ఎంతో కృషిచేశారని గుర్తుచేశారు. ఆయన నుంచి నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు.