ఒడిశా రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మొత్తం 60 వేల మంది ధర్నాలో పాల్గొన్నారు. ఈ పోరాటం రెండు రోజులుగా సాగుతుంది. దీంతో రాష్ట్రంలోని 60 వేల అంగన్వాడీలు మూతబడ్డాయి. జీతం పెంచాలని.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీ కార్యకర్తలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన ఆపమని హెచ్చరిస్తున్నారు. కాగా ప్రస్తుతం వారి జీతం రూ.7,500 ఉంది.. దానిని రూ.18 వేలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీతం పెంచాలని.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీ కార్యకర్తల ప్రధాన డిమాండ్. నెలకు రూ.18 వేలు, సహాయకులకు నెలకు రూ.9 వేలు వేతనం ఇవ్వాలని వారు కోరుతున్నారు. అలాగే నెలకు రూ.5 వేల పెన్షన్, విధుల్లో ఉండగా చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షలు చెల్లించాలని అడుగుతున్నారు. తమ డిమాండ్లను ఆమోదించే వరకు ధర్నాను విరమించేది లేదని అంగన్వాడీల అధ్యక్షురాలు సుమిత్రా మొహపాత్ర తెలియజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని, తమ డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు విన్న వించాం అని, వందకుపైగా ఉత్తరాలు రాశామని అంగన్వాడీ కార్యకర్తలు వెల్లడించారు. వాటిపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించ లేదని, పైగా తమపై మరింత పని భారాన్ని మోపిందని విమర్శించారు. అందుకే ప్రభుత్వానికి ముందుగా తెలియజేసే, 15 రోజుల నోటీసు ఇచ్చి ధర్నాకు దిగామని అఖిల భారతీయ అంగన్వాడీ మహా సంఘం సెక్రటరీ అంజలి పటేల్ చెప్పారు. కాగా ప్రస్తుతం బీహార్లో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 7,500లు మాత్రమే వేతనం అందిస్తున్నారు.