రసాభాసగా సారపాక గ్రామసభ
– రైతుల సమస్యలపై గళం విప్పిన టిఆర్ఎస్, వామపక్ష నేతలు
– పోడు రైతుల డిమాండ్ తో గ్రామసభ వాయిదా
సారపాక, నవంబర్ 25, మన్యం న్యూస్ :
సారపాక పట్టణంలోని పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల నిర్వహించిన పంచాయతీ వ్యాప్తంగా 571 దరఖాస్తులు వచ్చాయని పంచాయితీ కార్యదర్శి మహేష్ వెల్లడించారు. సదరు 571 దరఖాస్తులలో 150 దరఖాస్తులు ధ్రువీకరించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు మాట్లాడుతూ… తమ పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా మొక్కలు నాటారని, అందువలన ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో తమ దరఖాస్తులు నిరాకరించబడుతున్నాయని వాపోయారు. ప్రస్తుతం ప్లాంటేషన్ లో ఉన్న భూముల్లో ఎక్కువ శాతం భూములు పోడు రైతుల వద్ద ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్న వేనని రైతులు తమ ఆవేదనను పెళ్ళబుచ్చుకున్నారు. అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకొని మొక్కలు నాటిన తమ భూములను సైతం సర్వే చేయాలని, నిజమైన లబ్ధిదారులు ధ్రువీకరించబడిన తర్వాతనే గ్రామ సభ నిర్వహించాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల స్థాయి టిఆర్ఎస్, వామపక్ష నేతల సైతం పోడు రైతులకు న్యాయం చేయాలని, అర్హులైన రైతుల భూములను సర్వే చేసిన తర్వాతనే గ్రామ సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామసభను వాయిదా వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్డిపాలెం సర్పంచ్ భూక్య శ్రావణి, ఎఫ్ ఆర్ సి కమిటీ చైర్మన్ రాంబాబు, టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, పినపాక నియోజకవర్గం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల కొట్టి పూర్ణ, సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ లక్ష్మీ చైతన్య రెడ్డి, సారపాక పట్టణ ప్రధాన కార్యదర్శి ఏసోబు, టిఆర్ఎస్ నాయకులు చుక్కుపల్లి బాలాజీ, భానోత్ శ్రీను, పంగి సురేష్, సిపిఐ మండల అధ్యక్షులు మువ్వ వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకులు జహీర్, నాగేశ్వరరావు, సిపిఎం పార్టీ మండల అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, బిజెపి నాయకులు ఏనుగుల వెంకటరెడ్డి, గ్రామస్తులు, పోడు రైతులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.