: మొన్నటికి మొన్న విశాఖ గర్జన అన్నారు.. ఇప్పుడేమో రాయలసీమ గర్జన అంటున్నారు. అసలు అధికారంలో వున్నోళ్ళు ‘గర్జన’ పేరుతో హంగామా చేయడమేంటి.? ఈ ప్రశ్నలు సహజంగానే తెరపైకొస్తాయి. మూడు రాజధానుల బిల్లుని వైసీపీనే వెనక్కి తీసుకున్నాక, ఆ మూడు రాజధానుల పేరుతో గర్జనలు నిర్వహించడంలో అర్థమే లేదు. నిజానికి, వైసీపీ గర్జించాల్సింది ప్రత్యేక హోదాపై. కానీ, ఆ దిశగా వైసీపీ అస్సలేమాత్రం ఆలోచన చేయడంలేదు. కర్నూలు వేదికగా.. వైసీపీ ఫ్లాప్ షో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రౌడ్ పుల్లర్.. ప్రజా సంకల్ప యాత్రలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది.
కానీ, ముఖ్యమంత్రి అయ్యాక మంత్రి వైఎస్ జగన్, జన సమీకరణ కోసం ఒకింత ఇబ్బంది పడాల్సి వస్తోంది. గతంలో సుదీర్ఘ రాజకీయ ప్రసంగాలు చాలా తేలిగ్గా చేసేసిన వైఎస్ జగన్, ఇప్పుడు స్క్రిప్టు చూడకుండా మాట్లాడలేక పోతున్నారు. దాంతో, సహజంగా జగన్ సభల పట్ల జనాల్లో అసహనం పెరిగిపోయింది. జగన్ పాల్గొనకపోయినా, జగన్ కనుసన్నల్లోనే మొన్న విశాఖ గర్జన, ఇప్పుడు కర్నూలు గర్జన జరిగింది. ఈ రెండు గర్జనల్లోనూ వైసీపీ నేతల ప్రసంగాలు తేలిపోయాయి. మంత్రులు సైతం జనాన్ని ఆకట్టుకోలేక పోతున్నారు. లక్షల్లో కాదు, కోట్లల్లో ఖర్చవుతోంది ఈ గర్జనల నిర్వహణ కోసం. ఇదంతా ఖర్చు దండగ వ్యవహారంగానే మారిపోతోంది.