పుష్ప: ది రైజ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ఆ సినిమా సాంగ్స్ అంతకంటే పెద్ద హిట్ అయ్యాయి. మూవీ రిలీజై ఏడాది అవుతున్నా.. ఇప్పటికీ ఆ మూవీ సాంగ్స్ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా శ్రీవల్లి, సామి సామి, ఊ అంటావా సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. యూట్యూబ్‌లోనూ పుష్ప సాంగ్స్ సంచలనం సృష్టించాయి. 2022లో మోస్ట్ వాచ్డ్ వీడియోల్లో పుష్ప పాటలే మూడు ఉన్నాయి. అందులో ఊ అంటావా సాంగ్ హిందీ, తెలుగు రెండు వెర్షన్లూ ఉండటం విశేషం. శ్రీవల్లి పాట టాప్‌లో ఉండగా.. సామి సామి మూడు, ఊ అంటావా హిందీ వెర్షన్ ఆరు, తెలుగు వెర్షన్ ఏడో స్థానాల్లో ఉన్నాయి. అంటే మొత్తంగా టాప్ టెన్‌లో నాలుగు స్థానాలు పుష్ప మూవీ పాటలవే. ఇక బీస్ట్ మూవీలోని అరబిక్ కుత్తు లిరికల్ వీడియో రెండోస్థానంలో నిలిచింది.
కచ్చా బాదాం సాంగ్ నాలుగు, లే లే ఆయీ కోకా కోలా సాంగ్ ఐదు, పసూరి ఎనిమిది, అరబిక్ కుత్తు మ్యూజిక్ వీడియో తొమ్మిది, నాతునియా పదో స్థానంలో ఉన్నాయి. పుష్ప కంటే కమర్షియల్‌గా హిట్ అయిన సినిమాలు ఇంకా చాలానే ఉన్నా.. పాటల విషయంలో మాత్రం ఈ మూవీని మించలేకపోయాయి. ప్రస్తుతం పుష్ప మూవీ రష్యాలోనూ రిలీజ్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే. గురువారం (డిసెంబర్ 8) ఈ మూవీ రష్యాలోని 24 నగరాల్లో రిలీజ్ కాబోతోంది. దీనికోసం మూవీ టీమ్ అక్కడ ప్రమోషన్లు కూడా నిర్వహించింది. ప్రీమియర్ షోలకు కూడా హాజరైంది. ప్రత్యేకంగా రష్యన్ భాషలో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రష్యానే కాదు.. రానున్న రోజుల్లో మరికొన్ని దేశాల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.