UPDATES  

 BANGLADESHతో టెస్టు సిరీస్‌.. రోహిత్‌ శర్మ స్థానంలో INDIA-A ప్లేయర్!

బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ చేతి బొటన వేలికి గాయమైన విషయం తెలిసిందే. కుట్లు పడినా.. జట్టు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. 5 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 28 బంతుల్లో హాఫ్ సెంచరీ (51 నాటౌట్) బాదాడు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో బంగ్లాదేశ్‌తో శనివారం జరగనున్న మూడో వన్డేకు రోహిత్ దూరమయ్యాడు. అలానే బంగ్లాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కూ రోహిత్‌ దూరమయ్యాడు. రోహిత్‌ శర్మ గైర్హాజరీలో బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో భారత జట్టును కేఎల్ రాహుల్‌ నడిపించనున్నాడు. ప్రస్తుతం రాహుల్‌ వైస్ కెప్టెన్‌ అన్న విషయం తెలిసిందే. ఇక రోహిత్ స్థానంలో ఇండియా-ఎ జట్టు కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ బంగ్లా టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘అభిమన్యు ఈశ్వరన్‌ ప్రస్తుతం జరుగుతున్న ఇండియా- ఎ టెస్టు మ్యాచ్‌లో వరుసగా రెండు సెంచరీలు చేశాడు. ఓపెనర్‌గానూ బాగా ఆడుతున్నాడు. సిల్‌హట్‌లో రెండో టెస్టు మ్యాచ్‌ అనంతరం ఈశ్వరన్‌ బంగ్లాదేశ్‌ పర్యటనకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి’ అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.

అభిమన్యు ఈశ్వరన్‌ మొదటి టెస్టులో 141 పరుగులు చేశాడు. రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 144 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఉత్తరాఖండ్‌లో జన్మించిన ఈశ్వరన్ దేశీవాళీ క్రికెట్‌లో బెంగాల్‌ జట్టు తరపున ఆడుతున్నాడు. 2013లో ఈశ్వరన్ ఫ‍స్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 77 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన ఈశ్వరన్.. 5419 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్‌ సెంచరీ, 17 సెంచరీలు, 23 అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమైన సీనియర్ పేసర్‌ మహ్మద్‌ షమీ స్థానంలో ఉమ్రాన్‌ మాలిక్‌ లేదా ముఖేష్‌ కుమార్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. ముఖేశ్‌ కుమార్‌కు ఛాన్స్ దక్కే అవకాశాలే ఎక్కువ అని తెలుస్తోంది. మోకాలి గాయం తర్వాత రవీంద్ర జడేజా భారత జట్టులో కలుస్తుండడం సంతోషించాల్సిన విషయం. సౌరభ్‌ కుమార్‌, సూర్యకుమార్‌కు కూడా భారత టెస్టు జట్టులో చేరొచ్చు. డిసెంబర్‌ 14 నుంచి భారత్‌-బంగ్లా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !