జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘వారాహి’ అనే కారవాన్‌ని తయారు చేయించుకున్నారు. ఎన్నికల సమరానికి ఈ వాహనాన్ని వినియోగించనున్నారు జనసేనాని . ఆలివ్ గ్రీన్ కలర్‌లో వాహనం కనిపిస్తోంది. రాజకీయాల్లో ఇంతవరకు ఇలాంటి వాహనాన్ని ఏ రాజకీయ ప్రముఖుడూ వినియోగించలేదన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. గతంలో స్వర్గీయ ఎన్టీయార్ ‘చైతన్య రధాన్ని’ వినియోగించారు. ఆ తర్వాత కూడా రాజకీయ నాయకుల అవసరాల నిమిత్తం, ప్రత్యేక వాహనాల్ని రూపొందిస్తుండడం చూస్తూనే వున్నాం. అయితే, ఆలివ్ గ్రీన్ రంగు.. యుద్ధానికి సన్నద్ధం.. అన్న ప్రచారం.. వెరసి, ‘వారాహి’పై అనుమానాలు పెరుగుతున్నాయ్.
అనుమతులు అసాధ్యమట.. ఏపీకి చెందిన రవాణా శాఖ ఉనతాధికారి ఒకరు, మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను అనుసరించి, ఆలివ్ గ్రీన్ కలర్ వుంటే, ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ కుదరదని తెలుస్తోంది. అంతే కాదు, వాహనం తాలూకు టైర్ దగ్గర్నుంచి, అన్ని విషయాల్లోనూ నిబంధనలు పక్కగా అమలవుతాయని తేల్చి చెప్పారాయన. అంటే, ఒక్క చిన్న అదనపు ఆకర్షణ.. ‘వారాహి’ని ఏపీలో తిరగకుండా చేయొచ్చన్నమాట. అలాంటిది, వాహనానికి చాలా మార్పులు చేసేశారు. సో, ఏదో ఒక వంక పెట్టి ఏపీలోకి వారాహి అడుగు పెట్టకుండా అధికార వైసీపీ చేయడానికి వీలుంది. అదే జరిగితే, జనసేన తదుపరి వ్యూహమెలా వుండబోతోంది.? వేచి చూడాల్సిందే.