ఓ వ్యక్తి ముందడుగు వేస్తే, దాన్ని ఓర్వలేక వెనక్కి లాగేవాళ్ళు చాలామందే వుంటారు. రాజకీయాల్లో ఈ పోకడ అస్సలు మంచిది కాదు. బూతులు తిట్టడం రాజకీయాల్లో సభ్యత కాదు. జనసేనాని రాజకీయ పర్యటనల కోసం తయారు చేసిన వారాహి అనే వాహనానికి వేయబడిన రంగుల విషయాన్ని రవాణా శాఖ అధికారులు చూసుకుంటారు. జనసేన పార్టీలోకి నన్ను చాలామంది జనసేన కార్యకర్తలు తిరిగి ఆహ్వానిస్తున్నారు..’ ఇవన్నీ సీబీఐ మాజీ జేడీ, వీవీ లక్ష్మినారాయణ చేసిన వ్యాఖ్యలే. తాజాగా ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ సందర్భంగా జనసేనాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ గురించీ, జనసేనాని పవన్ కళ్యాణ్ గురించీ.! గతంలో విశాఖ నుంచి లక్ష్మినారాయణ జనసేన పార్టీ తరఫున పోటీ చేసి, ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ‘నేను ఓడిపోయానని అనుకోవడంలేదు.
మార్పు కోసం నాకు చాలామంది ఓట్లు వేశారు. అదే నా గెలుపు. జనసేన పార్టీ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది..’ అని లక్ష్మినారాయణ వ్యాఖ్యానించారు. మళ్ళీ విశాఖ నుంచే పోటీ చేస్తాననీ, వివిధ రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయనీ, ప్రత్యేకించి జనసైనికులు, జనసేన వీర మహిళలు తనను తిరిగి జనసేనలోకి ఆహ్వానిస్తున్నారనీ చెప్పుకొచ్చారు లక్ష్మినారాయణ. ‘వారాహి’ వాహనానికి సంబంధించి కొంతమంది అజ్ఞానంతో మాట్లాడుతున్నారన్న లక్ష్మినారాయణ, ఆ విషయం రవాణా శాఖ చూసుకుంటుందనీ, ఆలివ్ గ్రీన్ రంగులో వాహనం కనిపిస్తున్నా, అది వేరే రంగులో వుందనీ, దాన్ని రవాణా శాఖ అధికారులు ధృవీకరిస్తారని చెప్పుకొచ్చారు. ‘రూల్స్ అందరికీ వర్తిస్తాయి. న్యాయస్థానాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయమై చీవాట్లు తిన్నవారు, ప్రైవేటు వాహనానికి రంగు విషయమై అత్యుత్సాహం చూపుతుండడం శోచనీయం’ అని లక్ష్మినారాయణ ఎద్దేవా చేశారు.